
ఆసియా క్రీడలు 2026లో భారత క్రికెట్ జట్లు పతకాలు సాధిస్తే వాటిని ఎవరి చేతుల మీదుగా అందుకుంటాయన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఆసియా కప్ ట్రోఫీ ప్రదానోత్సవం విషయంలో ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీతో తలెత్తిన వివాదం నేపథ్యంలో.. జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లోనూ అలాంటి పరిస్థితి ఎదురవుతుందా అనే చర్చ మొదలైంది. అయితే ఈ రెండు టోర్నీల నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి.
ఓసీఏ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఆసియా క్రీడలను ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) నిర్వహిస్తుంది. OCA నిబంధనల ప్రకారం విజేతలకు మెడల్స్‌ను సాధారణంగా OCA అధ్యక్షుడు అందజేస్తారు. అయితే అవసరాన్ని బట్టి ఈ బాధ్యతను OCAలోని ఇతర సభ్యులకు అప్పగించే అవకాశం అధ్యక్షుడికి ఉంది. అంటే నఖ్వీకి అధికారికంగా ఆ బాధ్యత అప్పగిస్తే, ఆయన మెడల్స్ అందించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం నఖ్వీకి అలాంటి బాధ్యత అప్పగించినట్లు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
అదే సమయంలో మెడల్ ప్రెజెంటేషన్ సెర్మనీకి సంబంధించి OCA నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. విజయోత్సవ కార్యక్రమంలో రాజకీయ, మతపరమైన, వాణిజ్య లేదా జాతి ఆధారిత ప్రచారానికి అనుమతి లేదని రూల్ 66 పేర్కొంటోంది.
బీసీసీఐ ఏమంటోంది?
ఈ అంశంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ప్రస్తుతం భారత జట్ల దృష్టి పూర్తిగా మ్యాచ్‌లపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ముందుగా జట్లు పోడియంపైకి చేరాలని, ఆ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇంకా జరగని పరిణామాలపై ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల మహిళల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి టైటిల్ గెలిచిన భారత జట్టు.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించలేదు. అంతకుముందు 2025 పురుషుల ఆసియా కప్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ రెండు సందర్భాల్లోనూ ట్రోఫీ ప్రదానోత్సవంపై వివాదం నెలకొంది.
అయితే ఆసియా కప్‌ది ఏసీసీ పరిధిలోని ట్రోఫీ ప్రదానోత్సవం కాగా.. ఆసియా క్రీడల మెడల్ సెర్మనీ OCA పరిధిలో ఉంటుంది. కాబట్టి రెండు సందర్భాల్లో నిబంధనలు ఒకేలా ఉండవు. ప్రస్తుతం నఖ్వీకి ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్లకు మెడల్స్ అందించే బాధ్యత ఉంటుందా లేదా అన్నది OCA తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
