
DNews:22 Dec: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత KCR పై కాంగ్రెస్ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి.. కేసీఆర్ ఆదివారం మీడియాతో చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన విమర్శలు రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచాయి.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. విమర్శలు చేయాలంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కేసీఆర్కు సవాల్ విసిరారు. “తోలు తీస్తాం” అంటూ అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్ నిర్మించిన Kaleshwaram Project ను ప్రజలంతా చూశారని, తమ ప్రభుత్వం మాత్రం తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కేసీఆర్ పాలమూరు మీద కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేశామంటూ కేసీఆర్ చెప్పడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. “అందుకే కదా గత ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు” అంటూ ఎద్దేవా చేశారు. ‘‘మా తోలు తీయడం కాదు.. కవితమ్మ తీస్తున్న తోలుకి ముందు పాచెస్ వేసుకోండి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ ఇదే తరహా డైలాగులు కొట్టారని గుర్తుచేశారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో బీఆర్ఎస్ కండలన్నీ కరిగి తోలు మాత్రమే మిగిలిందని తీవ్ర విమర్శలు చేశారు. ఆ మిగిలిన తోలును కాపాడుకోవడానికే కేసీఆర్ “తోలు తీస్తా” అంటూ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రతిష్ట పూర్తిగా దిగజారిందని కేసీఆర్కు అర్థమైందన్నారు. అందుకే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. “కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానన్న ప్రాజెక్టులు కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎందుకు పూర్తి కాలేదు?” అంటూ ప్రశ్నించారు.కేసీఆర్ వ్యాఖ్యలు – మంత్రుల ప్రతివిమర్శలతో తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. రానున్న రోజుల్లో ఈ వాగ్వాదం ఇంకా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
