
DNews:26 Nov:హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో NSN ఇన్ఫోటెక్ పేరుతో స్థాపించిన ఐటీ కంపెనీ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న యువతను ఘరానా మోసం చేసి బోర్డు తిప్పేసింది. ఐటీ ఉద్యోగం ఇప్పిస్తామంటూ శిక్షణ పేరుతో నిరుద్యోగులకు వల వేసిన ఈ సంస్థ, సుమారు 400 మంది విద్యార్థుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 3 లక్షలు చొప్పున భారీగా నగదు వసూలు చేసిన కంపెనీ అధినేత స్వామి నాయుడు పరారయ్యాడు. దీంతో డబ్బులు కట్టి మోసపోయిన అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. ఐటీ కేంద్రమైన హైదరాబాద్‌లో నిరుద్యోగులు, ఫ్రెషర్స్‌ను లక్ష్యంగా చేసుకొని మోసం చేసే ఇలాంటి బురిడీ కంపెనీలు సర్వసాధారణమై పోయాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగంపై మోజుతో నగరానికి వచ్చే యువతనే టార్గెట్ చేస్తూ, ఈ నకిలీ కంపెనీలు గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్‌మెంట్లలో లేదా రెంటల్ వర్క్‌స్టేషన్లలో కార్యకలాపాలు నడుపుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే వాటిల్లో 90 శాతం ఫేక్ కంపెనీలే ఉంటున్నాయి. ఏదో ప్రాజెక్టు ఉందని రిక్రూట్ చేసుకుని, సెక్యూరిటీ డిపాజిట్, శిక్షణ ఇతర అంశాలంటూ డబ్బులు వసూలు చేసి, ఆ తర్వాత కాలయాపన చేయడం ద్వారా అభ్యర్థే విసిగిపోయి ఉద్యోగాన్ని వదిలిపోయేలా ఈ తరహా కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయి.
