
DNews:13 NOV:వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఘోర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. రక్షణ కంచ లేకుండా పాఠశాల ప్రహరీ గోడకు ఆనుకొని ఉన్న 33 కేవీ ట్రాన్స్ఫార్మర్ చిన్నారి ప్రాణాలను పొంచి ఉన్న ప్రమాదంలోకి నెట్టింది.బుధవారం మధ్యాహ్నం గంగారం ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి విద్యార్థి వంశీ మధ్యాహ్న భోజనం చేయడానికి వస్తుండగా ట్రాన్స్ఫార్మర్ తీగ తగిలింది. దీంతో చిన్నారి చేతులు, కాళ్లు, తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
అయితే అక్కడ చిన్నారులకు అవసరమైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్డీవో, తహసీల్దార్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.“పాఠశాల బయటే ఉన్న ట్రాన్స్ఫార్మర్కి రక్షణ కంచ ఎందుకు ఏర్పాటు చేయలేదని” స్థానికులు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
