
DNews:19 Nov:హైదరాబాద్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఓ తండ్రి బాధను వీక్షించిన వారంతా కళ్లీరెత్తి ఏడ్చే పరిస్థితి నెలకొంది. కుమారుడి అంత్యక్రియలకు డబ్బులు లేక, మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని 8 గంటలపాటు స్మశానంలో కూర్చున్న హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.జిల్లా కేంద్రంలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన బాలరాజ్ కుటుంబం గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. స్థానిక పత్తి మిల్లులో పని చేసుకునే బాలరాజ్, మిల్లు మూతపడడంతో ఆదాయం కోల్పోయాడు. దీంతో కుటుంబ జీవితం స్తంభించింది. ఇప్పటికే దివ్యాంగుడైన పెద్ద కుమారుడితో జీవనం సాగిస్తున్న సమయంలో, భార్య చిన్న కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.
ఈ నేపథ్యంలో తన దగ్గరే ఉన్న పెద్ద కుమారుడు హరీష్ (8) తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందాడు. చివరి సంస్కారాలు చేయడానికి డబ్బులు కూడా లేని పరిస్థితిలో బాలరాజ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.దాంతో నిరుపాయంగా మృతదేహాన్ని అట్టడుగు వర్గాల స్మశానవాటికకు తీసుకెళ్లి అక్కడే 8 గంటలపాటు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్నాడు.“జీవితంలో ఉన్నప్పుడు తిండిపెట్టలేకపోయాను… చనిపోయాక అంత్యక్రియలు కూడా చేయలేకపోతున్నాను” అని బాలరాజ్ ఆవేదన వ్యక్తం చేయగా, అక్కడున్నవారి హృదయాలు పగిలిపోయాయి.
ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగం సామాజిక భద్రత, పేద కుటుంబాల సంక్షేమంపై మరల దృష్టిని సారించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
