
DNews:23 Apr: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరం కావడంతో ప్రయాణికుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా నియమించిన ప్రైవేట్ డ్రైవర్లు కొందరు ఇదే అదనుగా భావించి అక్రమ వసూళ్లకు తెరలేపారు. తాజాగా ఒక ప్రైవేట్ డ్రైవర్ ప్రయాణికుల నుండి టికెట్ ఛార్జీలకు బదులుగా నేరుగా తన వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు మళ్లించుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది.
సదరు డ్రైవర్ తన వ్యక్తిగత మొబైల్ ఫోన్లోని క్యూఆర్ (QR) కోడ్ను ప్రయాణికులకు చూపిస్తూ, వారి నుండి డిజిటల్ పేమెంట్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీనిపై అనుమానం వచ్చిన ఒక ప్రయాణికుడు ప్రశ్నించగా, ఆ డబ్బులను తన ‘టీ ఖర్చుల’ కోసం తీసుకుంటున్నానని ఏమాత్రం తడబడకుండా సమాధానం ఇచ్చాడు. ప్రభుత్వం ఒకవైపు వీరికి వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ, పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా చేసుకుని ఇలా ప్రయాణికులను దోచుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేట్ డ్రైవర్ల అనుభవలేమి వల్ల ఇప్పటికే పలు ప్రమాదాలు చోటుచేసుకుంటుండగా, ఇప్పుడు ఇలాంటి అక్రమ వసూళ్ల ఉదంతాలు తోడవ్వడం ఆర్టీసీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఈ తంతునంతా ఒక ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
