
DNews:11 Feb: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి అనుమతించడం లేదని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. లక్షెట్టిపేటలోని 9, 10వ వార్డుల పోలింగ్ కేంద్రాల వద్ద ఈ వివాదం చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ తరఫున ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్‌ను పోలీసులు పోలింగ్ బూత్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం ఏజెంట్లను అనుమతించాలని ఆయన ప్రశ్నించగా, పోలీసులు ఆయనను పోలింగ్ కేంద్రం ఆవరణ నుండి బలవంతంగా పక్కకు ఈడ్చుకెళ్లారు. పోలీసుల తీరుకు నిరసనగా శ్రీనివాస్ గౌడ్ పోలింగ్ కేంద్రం ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎన్నికల అధికారులు మరియు అదనపు పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకున్నారు.
