
DNews:24 Jan: హైదరాబాద్‌లోని నాంపల్లిలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాంపల్లి స్టేషన్ రోడ్డు సమీపంలోని చీరక్‌గల్లి లైన్‌లో ఉన్న ఒక ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. నాలుగు అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానిక నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. దుకాణంలో ఫర్నిచర్ తయారీకి వాడే కలప, రసాయనాలు, కుషన్లు వంటి వస్తువులు భారీగా ఉండటంతో మంటలు క్షణాల్లో పై అంతస్తులకు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇరుకైన గల్లీలు కావడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడుతోంది. ప్రమాద సమయంలో భవనంలో కొందరు చిక్కుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు, రెస్క్యూ టీమ్స్ వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం భారీగా సంభవించినట్లు తెలుస్తోంది.
