
DNews:24 Jan: హైదరాబాద్లోని యూసఫ్ గూడ డంపింగ్ యార్డ్లో నేడు తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఒక జీహెచ్ఎంసీ (GHMC) పారిశుద్ధ్య కార్మికుడు ప్రమాదవశాత్తూ చెత్త తొలగించే మిషన్లో పడి ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా, దుగ్గలి మండలం, పగిడిరాయి గ్రామానికి చెందిన కార్మికుడు యూసఫ్ గూడ డంపింగ్ యార్డ్లో విధులు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో చెత్తను తరలించే లారీ నుండి చెత్తను ఖాళీ చేసే క్రమంలో లారీ వెనుక డోర్ సరిగ్గా పనిచేయకపోవడంతో సాంకేతిక ఇబ్బంది తలెత్తింది. ఈ క్రమంలో ఆయన దానిని సరిచేసేందుకు ప్రయత్నిస్తుండగా, ఒక్కసారిగా కాలు జారి చెత్తను లోపలికి లాక్కునే శక్తివంతమైన మిషన్లో పడిపోయారు. తోటి కార్మికులు గమనించి మిషన్ను ఆపే లోపే సదరు కార్మికుడు అందులో చిక్కుకుని అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ఈ ఘటనతో ఆగ్రహించిన మృతుడి బంధువులు మరియు తోటి కార్మికులు డంపింగ్ యార్డ్ వద్ద ఆందోళనకు దిగారు. పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న రాంకీ సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని వారు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, భారీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
