
DNews:09 Feb: ఖమ్మం జిల్లాలో సాగునీటి ఎద్దడి రైతులను రోడ్డెక్కేలా చేసింది. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామ పరిధిలోని ఏన్కూరు – పల్లిపాడు ప్రధాన రహదారిపై నేడు రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని, దీనివల్ల వేలాది ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న, ఇతర పంటలు చేతికి వచ్చే దశలో ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న వారబందీ పద్ధతి వల్ల తమకు సకాలంలో నీరు అందడం లేదని, వారం రోజులుగా కాలువలు వెలవెలబోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల నిరసనతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తమ సమస్యను స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైతులు తెలిపారు. కష్టపడి పండించిన పంటలు కళ్లముందే ఎండిపోతుంటే దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, వెంటనే సాగర్ జలాలను విడుదల చేసి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సాగునీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి నీటి విడుదలపై హామీ ఇప్పించడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.
