
DNews:14 NOV:మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని రొట్టెపల్లి గ్రామ పంచాయతీ శివారులో ఉన్న గుట్టలను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. కాసుల కోసం ప్రకృతి అందాలతో కూడిన ఈ సంపదను నిరంతరం తవ్వేసి, అక్రమంగా బండరాళ్లను తరలిస్తున్నారు. ఈ అక్రమ తంతు రోజువారీగా జరుగుతున్నప్పటికీ, చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు మాత్రం స్థానికులు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదనే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై స్థానిక ఆదివాసీ గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో, ఆగ్రహించిన గిరిజనులు శుక్రవారం ఉదయం స్వయంగా బండరాళ్లు తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. గుట్టలను పూర్తిగా తవ్వేసి మాయం చేస్తున్నారని, ఈ అక్రమార్కులు కొన్ని రోజులు ఆపినా మళ్లీ యధావిధిగా తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. అధికారులు ఇంత ఘోరంగా వ్యవహరించడంపై వారు మండిపడుతూ, ఈ అక్రమ తవ్వకాలపై ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
