
DNews:18 Mar: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వెనుకబడిన తరగతుల (BC) సంక్షేమంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కీలక డిమాండ్ చేశారు. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో కనీసం రూ. 20,000 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ వంటి కుల వృత్తుల ప్రోత్సాహక పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం రూ. లక్ష ఆర్థిక సాయం పథకాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మి బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆరు గ్యారంటీలలో భాగంగా బీసీల కోసం ప్రత్యేక డిక్లరేషన్‌ను అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని తలసాని విమర్శించారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తగిన వాటా ఇచ్చి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన హితవు పలికారు.
