
D News: మ్యాచో స్టార్ గోపీచంద్ తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తన 33వ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే గోపీచంద్ కెరీర్‌లో ‘జయం’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రఘు అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో గోపీచంద్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ పాత్రను తాను విలన్‌గా భావించకుండా.. కేవలం నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌గానే భావించి నటించానని గతంలో చెప్పాడు.
‘జయం’ షూటింగ్ చివరి రోజున దర్శకుడు తేజ తనకు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని గోపీచంద్ వెల్లడించాడు. “తొందరపడొద్దు.. సినిమా విడుదలైన తర్వాత నీ రేంజ్ ఎక్కడ ఉంటుందో నీకే తెలియదు. నిన్ను నువ్వు విలన్‌గా అనుకోవద్దు. తొందరపడి ఏది పడితే అది ఒప్పుకోవద్దు” అని తేజ సూచించినట్లు తెలిపాడు.
తేజ చెప్పినట్లుగానే ‘జయం’ విడుదల తర్వాత గోపీచంద్ పోషించిన రఘు పాత్రకు భారీగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత హీరోగా మారిన గోపీచంద్ ‘యజ్ఞం’, ‘రణం’, ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు.
