
D News: సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’. మాథిమారన్ పుగళేంది తెరకెక్కించిన ఈ సినిమా సముద్రం, పడవ పందాలు, స్నేహం, శత్రుత్వం చుట్టూ సాగుతుంది.
కథేంటి?
కళింగపట్నంలో పడవ పందాల్లో మంచి పేరు తెచ్చుకున్న ముత్తుకాళి (సూరి) కొన్ని కారణాలతో ఆ ఆటకు దూరమై 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటాడు. ఈలోగా సాట్టై పులి (సుహాస్) ఊరిపై తన ఆధిపత్యాన్ని పెంచుకుంటాడు. పులి కొడుకుతో జరిగిన గొడవ కారణంగా మారి (మిథున్) కాళి దగ్గరకు చేరడంతో.. 20 ఏళ్ల తర్వాత అతడు తిరిగి ఊరికి వస్తాడు. తన టీమ్‌ను తయారు చేసి మళ్లీ పడవ పందాలకు సిద్ధమవుతాడు. కాళి, పులి మధ్య స్నేహం ఎందుకు శత్రుత్వంగా మారింది? అనేదే మిగతా కథ.
పడవ పందాల సన్నివేశాలు అదుర్స్
సినిమాకు ప్రధాన బలం పడవ పందాల సన్నివేశాలే. సముద్రంలో తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా సహజంగా, భారీ స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ఫస్టాఫ్‌లో కాళి, పులి మధ్య వైరం గురించి బిల్డప్ ఎక్కువగా ఉన్నా.. ఇంటర్వెల్ తర్వాత కథ వేగం పుంజుకుంటుంది. సెకండాఫ్‌లో అక్కడక్కడా కాస్త నెమ్మదించినా.. ప్రధాన కాన్‌ఫ్లిక్ట్ మొదలయ్యాక ఆసక్తికరంగా సాగుతుంది.
సూరి, సుహాస్ పోటాపోటీ నటన
సూరి తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ముత్తుకాళి పాత్రలో చాలా సెటిల్డ్‌గా కనిపించాడు. సుహాస్ కూడా సాట్టై పులి పాత్రలో గట్టిగా నిలబడ్డాడు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
మహిమ నంబియార్‌కు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్‌గా ఎలా ఉంది?
జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో బలం. సముద్రం, పడవ పందాల విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది.
ఓవరాల్‌గా.. ‘మండాడి’ రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాకు భిన్నంగా సముద్రం, పడవ పందాలు, యాక్షన్, ఎమోషన్‌తో సాగిన ఆసక్తికరమైన సినిమా. సూరి, సుహాస్ నటనతో పాటు పడవ పందాల సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు.
