Yadav Community’s Participation Is Crucial for Telangana’s Development: CM Revanth Reddy at Sadar Sammelan

సదర్‌ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది యాదవుల ఆత్మగౌరవం కోసమేనని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో యాదవులు భాగస్వాములు కావాలని పిలుపు

హైదరాబాద్, నవంబరు 4: యాదవుల ఆకాంక్ష మేరకే తమ ప్రభుత్వం సదర్‌ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ వేడుక కేవలం యాదవులకే పరిమితం కాదని, తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో బుధవారం నిర్వహించిన శ్రీకృష్ణ సదర్‌ సమ్మేళనానికి సీఎం హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా యాదవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వారి ఆత్మగౌరవానికి ఎక్కడా భంగం కలగకుండా చూసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు.

భారత్‌ ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి సహకరించాలి

దేశంలో తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్‌రెడ్డి అన్నారు. మూసీ అభివృద్ధి, మెట్రో విస్తరణ, భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం వంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో యాదవ సోదరులు భాగస్వాములు కావాలని కోరారు.

హైదరాబాద్‌లోని గోల్కొండ కోటను గతంలో గొల్లంకొండగా పిలిచేవారని సీఎం గుర్తుచేశారు. యాదవ సోదరుల సహకారం, ఆదరణతోనే హైదరాబాద్‌ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారిని యాదవులు ఆదరించి అక్కున చేర్చుకున్నారని ప్రశంసించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా సదర్‌ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాలనే ఆలోచన చేయలేదని అన్నారు.

సదర్‌ సమ్మేళనానికి రూ.5 కోట్లు

తమ ప్రభుత్వం సదర్‌ సమ్మేళనం నిర్వహణ కోసం రూ.5 కోట్లు మంజూరు చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు. రాష్ట్రంలో యాదవులకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా, నవీన్‌ యాదవ్‌కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించామని తెలిపారు. ఈశ్వరమ్మ యాదవ్‌ను యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలిగా నియమించిన విషయాన్ని ప్రస్తావించారు. యాదగిరిగుట్ట గోశాలలో గోవుల సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులోనూ యాదవులకు దక్కాల్సిన వాటా, అవకాశాలు వారికి అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *