
D Spiritual: Nov 24: భారతదేశం అనగానే ఆధ్యాత్మికత గుర్తుకు వస్తుంది. ఆ ఆధ్యాత్మికతకు ప్రతీకలైన ఆలయాలు దేశమంతటా ప్రత్యేక శైలుల్లో కనిపిస్తాయి. అయితే దక్షిణాదికి వచ్చేసరికి భారీ గోపురాలే ఈ ప్రాంత ఆలయాల ప్రత్యేకతగా నిలుస్తాయి. ఈ గోపురాలు దక్షిణాది ప్రజల సాంస్కృతిక వారసత్వానికి సూచికలుగా నిలుస్తూ, తమిళనాడు రాజముద్రపైనా శ్రీవిల్లిపుత్తూరు గోపురం దర్శనమిస్తుంది.
ఇప్పుడున్నట్లుగా భవంతులు ఎత్తెత్తుగా నిలువనప్పటికీ, ఒకప్పుడు ఊరంతట్లోనే ఎత్తైన నిర్మాణాలు గోపురాలే. దూరం నుంచే అవి కనిపిస్తూ, ఆ ఊరి పరిధికి చేరుకున్న సంకేతం అందించేవి. అందుకే గోపురం అన్న పదానికి ‘పట్టణ ద్వారం’ అన్న అర్థం కూడా వచ్చిందని చెబుతారు. ఇప్పటికీ కంచి వైపుగా ప్రయాణిస్తే పది కిలోమీటర్ల దూరం నుంచే అక్కడి గోపురాలు కనువిందు చేస్తాయి.
ఊరిలో ఉన్న అత్యంత ఎత్తైన, సురక్షితమైన నిర్మాణం గోపురం కావడంతో, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అది రక్షణగా ఉండేది. ఆధ్యాత్మికంగా స్వామివారి ఆశ్రయం లభిస్తే, భౌతికంగా గోపురం సమీపంలో ఆశ్రయమైనా లభించేది. అందుకే విపత్తుల సమయంలో ఆలయ పరిసరాలు ప్రజలకు ఉపశమనం కలిగించేవి.
పూర్వం ఒక ఊరి నుంచి మరో ఊరకు ప్రయాణించే బాటసారులకు ప్రతిచోటా సత్రాలు అందుబాటులో ఉండేవి కావు. అయితే ఆలయం లేని ఊరు దాదాపు ఉండేది కాదు. అలాంటి సందర్భాల్లో గోపురం నీడలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, చీకటి దాటే వరకూ కూర్చొని, కొంత ఆహారం తీసుకుని వారి ప్రయాణాన్ని కొనసాగించేవారు.
సహస్రాబ్దాల పాటు యుద్ధాలు, దండయాత్రలు, ఆక్రమణలు తరచుగా జరిగేవి. ఎప్పుడు ఏ దిశ నుంచి శత్రువు దాడి చేస్తాడో తెలియని పరిస్థితి. ఈ సందర్భాల్లో గోపురాలు ‘వాచ్ టవర్ల’లా ఉపయోగపడేవి. శత్రుసైన్యాల కదలికలను దూరం నుంచే గమనించడం వీలైనందున గ్రామ రక్షణలో ఇవి కీలకపాత్ర పోషించాయి.
గోపురాలపై ఉన్న కలశాలు పిడుగును నిర్వీర్యం చేసే ‘ఎర్త్ వైర్’ లాగా పనిచేస్తాయని చాలామంది నమ్మకం. ఊరిలోని ఇతర కట్టడాల కంటే ఈ గోపురాలు ఎక్కువ ఎత్తులో ఉండటం వల్ల పిడుగుపాట్లను అవే ఎదుర్కొని, దాని దుష్ప్రభావం ఊరికి ఆగకుండా కాపాడుతాయని విశ్వాసం. గోపురాల నిర్మాణంలో ఉపయోగించిన సామగ్రి కూడా పిడుగులను శోషించేందుకు అనుకూలమని చెబుతారు.
భౌతిక ప్రయోజనాలు పక్కన పెడితే, గోపురాలు ఆధ్యాత్మికంగా అపారమైన శాంతిని అందిస్తాయి. వాటిపై చెక్కిన కళాసృష్టులు, శిల్పాలు భగవంతుని వైభవాన్ని ప్రతిబింబిస్తూ భక్తుల హృదయాలను అలరిస్తాయి. గోపురం కింద నిలబడి పైకి చూసిన క్షణం మనసు మరో లోకానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తుంది. గర్భగుడి వైపు అడుగులు వేస్తే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించిన భావన కలుగుతుంది.
భౌతికంగానూ, ఆధ్యాత్మికంగానూ గోపురాలు ఇంత విశిష్టమైన ప్రాముఖ్యత కలిగి ఉండటంతో, శతాబ్దాల క్రితమే ప్రారంభమైన ఈ నిర్మాణ పద్ధతిని నేటికీ ఆదరిస్తూ, పునర్‌నిర్మించుకుంటూ వస్తున్నారు.
