
D Spiritual: Nov 24: భారతదేశంలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా ఆలయాలకు శతాబ్దాలుగా కొనసాగుతున్న రహస్యాలు, విశిష్టతలు ఉన్నాయి. అలాంటి ప్రత్యేకత కలిగిన ఆలయాలలో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఉన్న అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఒకటి. ఈ ఆలయం మిస్టరీతో నిండిన శివాలయంగా పేరుగాంచింది.
ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం రోజుకు మూడు సార్లు మూడు వేర్వేరు రంగుల్లో కనిపించడం విశేషం. ఉదయం వేళల్లో ఇది ఎర్ర రంగులో, మధ్యాహ్నం సమయంలో కాషాయం రంగులో, సాయంత్రం వేళ చామన చాయ (నీలం) రంగులో దర్శనమిస్తుంది. శివలింగం సాలగ్రామ రూపంలో ఉండటం దీని విశిష్టతను మరింత పెంచుతుంది. రోజు మూడు వేళల్లో మూడు రంగుల్లో కనిపించడం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది.
ఈ అరుదైన మిస్టరీని ఇప్పటివరకు ఏ శాస్త్రవేత్త కూడా పూర్తిగా నిరూపించలేకపోయారు. శివలింగం రంగులు మారడాన్ని చూడటానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు అక్కడే ఉండి ఈ అద్భుత మార్పును ప్రత్యక్షంగా వీక్షిస్తారు.
శివలింగం రంగులు మారడానికి కారణాన్ని తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు జరిగాయి. కొందరు నిపుణులు దీనికి సూర్యకాంతి ప్రభావమే కారణమని భావించారు. అయితే ఈ విశ్వాసాన్ని పూర్తిగా నిర్ధారించలేకపోయారు. ఇందులో ఇంకా అనుమానాలు, రహస్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.
స్థానికుల మాటల ప్రకారం ఈ ఆలయం దాదాపు 2500 సంవత్సరాల పురాతనమైంది. ఈ ఆలయంలో పంచలోహాలతో తయారుచేసిన నంది విగ్రహం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించే ఈ అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఇప్పటికీ శాస్త్రానికి సవాల్‌గా నిలుస్తోంది.
