
D Spiritual: Dec 11: మనలో చాలా మంది వివిధ పరిస్థితుల వల్ల అద్దె ఇళ్లలో నివసిస్తూ తరచూ ఇల్లు మార్చుతూ ఉంటారు. ఈ మార్పుల్లో కొత్త ఇంట్లో పాలు పొంగించడం, గోమయ పంచమిని పూయడం, హోమం చేయడం, సత్యనారాయణ వ్రతం వంటి పూజలు చేస్తారు. అయితే ఇవి అద్దె ఇంట్లో చేయడం మంచిదా కాదా అన్న విషయంపై స్పష్టత లేకపోవచ్చు. ఈ సందర్భంలో అద్దె ఇంటికి మారేటప్పుడు పాటించాల్సిన కొన్ని విశేష ఆచారాలు, నియమాల గురించి తెలుసుకోవడం అవసరం.
పూర్వం నుంచి మన దేశంలో ఇంటి విషయంలో అనేక సంప్రదాయాలు సాగుతున్నాయి. కాలం మారినా, మనం నివసించే గృహాన్ని దేవుని వాసస్థలంగా భావించే సంస్కారం మాత్రం మారలేదు. అందుకే సొంతిల్లు అయినా, అద్దె ఇల్లు అయినా దానిని పవిత్రంగా భావించి కొన్ని ఆచారాలను తప్పక పాటించాలి.
ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ మార్పులు, పిల్లల చదువులు వంటి కారణాల వల్ల చాలా మంది అద్దె ఇళ్లలోనే జీవనం కొనసాగిస్తూ తరచుగా ఇల్లు మార్చాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో తిథి, మాసం, శుభ సమయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా తొందరపాటుతో ఇల్లు మార్చడం మంచిది కాదు. అలా చేయడం వల్ల అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని పండితులు సూచిస్తున్నారు.
అద్దె ఇంట్లోకి మారడానికి శ్రావణం, భాద్రపదం, ఆషాఢం వంటి మాసాలు శుభప్రదంగా భావించబడుతున్నాయి. ఇతర మాసాల్లోనూ పాడ్యమి, పంచమి, విడియ, తదియ, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి వంటి తిథుల్లో ఇల్లు మారితే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
వారం రోజుల విషయంలో శుక్రవారం ఇల్లు మారడం అత్యంత శుభకరంగా ఉంటుంది, ఎందుకంటే అది లక్ష్మీదేవికి అంకితమైన రోజు. బుధవారం, గురువారం రోజులు కూడా అనుకూలం. అయితే అత్యవసర పరిస్థితుల్లో శనివారం, ఆదివారం ఇల్లు మారవచ్చు. కానీ సోమవారం, మంగళవారం రోజుల్లో అద్దె ఇంట్లోకి అడుగు పెట్టడం శ్రేయస్కరం కాదని పండితులు పేర్కొంటున్నారు.
సాధారణంగా సొంతింట్లో ప్రవేశించినప్పుడు పాలు పొంగించడం శుభకార్యంగా భావించి శుభ ముహూర్తాన్నే చూసి చేస్తారు. కానీ అద్దె ఇంట్లో మాత్రం పాలు పొంగించడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. అలా చేస్తే సొంతిల్లు నిర్మించుకోవాలనే కోరిక నెరవేరడం ఆలస్యం అవుతుందని, సానుకూల శక్తులు భవన యజమానికి లభించి ప్రతికూల శక్తులు నివాసిస్తున్న వారికి చేరవచ్చని పండితులు అంటున్నారు.
అద్దె ఇంట్లోకి మారిన తర్వాత ఆ ఇల్లు మనకు అనుకూలమా, ప్రతికూలమా అనే విషయం మూడు నెలల్లోపే తెలుస్తుందట. ఈ గడువు దాటిన తర్వాత ఇబ్బందులు వస్తే ఆ ఇంటిని విడిచి వెళ్లడం కూడా సులభం కాకపోవచ్చు. అంతేకాదు ఇంటి దిక్కు, దిశలు కూడా ఆ ఇంటిలో మన జీవనం ఎలా సాగుతుందనే విషయంలో ప్రభావం చూపుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
