
D Spiritual: Dec 11: మందిరాలకు భక్తులు తమకు నచ్చిన దేవుళ్లను పూజించడానికి, మొక్కులు చెల్లించుకోవడానికి తరచుగా వెళ్తుంటారు. అయితే ఆలయంలోకి వెళ్లే సమయంలో, అలాగే ఆలయం నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత చాలా మంది తెలియకపోయినా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇవి జ్యోతిష్య పండితుల మాటల ప్రకారం దేవుడి అనుగ్రహాన్ని తగ్గించే అంశాలుగా భావించబడుతున్నాయి. వీటి గురించి తెలుసుకోవడం ప్రతి భక్తుడికి అవసరం.
ఆలయం వద్దకు చేరుకున్న వెంటనే పాదరక్షలను బయట వదిలి, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం శాస్త్రోక్తం. కొందరు నేరుగా లోపలికి వెళ్లిపోతుంటారు, ఇది మంచిది కాదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. నీళ్లను కాళ్లకు, కొద్దిగా తలపై చల్లి శుద్ధితో ఆలయంలో ప్రవేశించడం శుభకరమని చెబుతున్నారు.
ఆలయం లోపలికి వెళ్లేటప్పుడు ధ్వజస్తంభాన్ని కుడి వైపు నుంచి తిరిగి ప్రవేశించాలని శాస్త్రం చెబుతుంది. ఎడమ వైపు వెళ్లడం అనుకూలం కాదని భావిస్తారు. కుడివైపు నుంచే ప్రవేశిస్తే భగవంతుడి దర్శనం సంపూర్ణత పొందుతుందని జ్యోతిష్య పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.
గుడికి వెళ్లినప్పుడు మొదట నవగ్రహాలను దర్శించుకోవాలా? లేక నేరుగా ప్రధాన దేవుడిని దర్శించుకోవాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. శాస్త్ర ప్రకారం ముందుగా నవగ్రహాలను దర్శించి, మళ్లీ కాళ్లు కడుక్కొని ఆలయంలోకి ప్రవేశించి తర్వాత ప్రధాన దేవుడిని దర్శించుకోవాలి.
దేవుని దర్శనం చేసుకునేటప్పుడు పూర్తిగా ఎదురుగా నిలబడకూడదని, కొంచెం పక్కదారిగా నిలబడి దర్శనం చేసుకోవాలని చెబుతారు. అలాగే దర్శనం పూర్తయ్యాక బయటకు వెళ్లేటప్పుడు దేవుడికి పూర్తిగా వీపు చూపకుండా వెళ్లడం శ్రేయస్కరం.
ఆలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే అక్కడి ప్రాంగణంలో కనీసం రెండు నిమిషాల పాటు కూర్చోవడం మంచి ఫలితాలను ఇస్తుందని విశ్వాసం.
గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని అనేక మంది బయటకు వచ్చేటప్పుడు మార్గమధ్యలో తింటారు. కానీ, ప్రసాదాన్ని సాధ్యమైనంతవరకు ఆలయ ప్రాంగణంలోనే సేవించాలి. అలా చేస్తే అది మరింత శుభప్రదమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
గుడిలో రావిచెట్టు, వేపచెట్టు కలిసికొని ఉంటే వాటికి ప్రదక్షిణలు చేసి రావాలి. ఇది సంపూర్ణమైన శుభఫలితాలను ప్రసాదించేదిగా భావిస్తారు.
అలాగే, ఆలయం నుంచి నేరుగా ఇంటికి రావాలా? లేక వేరే చోటుకెళ్లొచ్చా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. గుడికి మాత్రమే వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా నేరుగా ఇంటికే రావాలని, కానీ ఏదైనా పనిమీద బయటికి వెళ్లిన సందర్భంలో గుడికి వెళితే ఆ పని ముగించుకొని ఇంటికెళ్లొచ్చని శాస్త్రం చెబుతోంది.
గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోవద్దని జ్యోతిష్యులు అంటున్నారు. కనీసం ఐదు నిమిషాలు ఇంట్లో కూర్చున్న తర్వాత మాత్రమే కాళ్లు కడుక్కోవాలి. అదే విధంగా వెంటనే స్నానం చేయటం కూడా మంచిది కాదు. 48 నిమిషాల తర్వాత మాత్రమే స్నానం చేయాలని సూచిస్తున్నారు.
