
తెలంగాణలో లెప్టోస్పిరోసిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2023లో కేవలం రెండు కేసులు నమోదవగా.. 2025లో 249కి చేరి దాదాపు 125 రెట్లు పెరిగాయి. ఈ ఏడాది జూన్ నాటికే 101 కేసులు నమోదయ్యాయి. ఎలుకల మూత్రంతో కలుషితమైన నీరు, మట్టితో ఈ వ్యాధి వ్యాపిస్తుంది. భారీ వర్షాలు, వరదలు, డ్రైనేజీ సమస్యలు, పారిశుద్ధ్య లోపాలు ముప్పును పెంచుతున్నాయి. అధిక జ్వరం, తీవ్రమైన ఒళ్లునొప్పి, కళ్లు ఎర్రగా మారటం, కిడ్నీ సమస్యలు ప్రధాన సంకేతాలు. డెంగీగా పొరబడకుండా సకాలంలో పరీక్షలు, చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తెలంగాణలో వర్షాకాలంలో వ్యాప్తి చెందే లెప్టోస్పిరోసిస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గత మూడేళ్లలో ఈ బ్యాక్టీరియా వ్యాధి కేసుల పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. 2023లో రాష్ట్రంలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదవగా.. 2025 నాటికి ఆ సంఖ్య 249కి చేరింది. అంటే దాదాపు 125 రెట్లు పెరిగింది. ఈ ఏడాది జూన్ నాటికే 101 కేసులు నమోదవడంతో వర్షాకాలంలో వ్యాధి వ్యాప్తి కొనసాగుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2025లో దేశంలో అత్యధిక లెప్టోస్పిరోసిస్ కేసులు కేరళలో 4,001 నమోదయ్యాయి. తమిళనాడులో 2,862, కర్ణాటకలో 2,302, మహారాష్ట్రలో 2,184 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పరంగా తెలంగాణ ఈ రాష్ట్రాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. మూడేళ్ల వ్యవధిలో పెరిగిన కేసుల శాతం మాత్రం దేశంలోనే అత్యధికంగా ఉంది. ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ కేసులు పెరిగాయి.
లెప్టోస్పిరోసిస్ ప్రధానంగా ఎలుకల మూత్రంతో కలుషితమైన నీరు లేదా మట్టితో మనుషులకు వ్యాపిస్తుంది. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు కలుషిత నీటితో ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువవుతుంది. హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నెలకు సగటున 10 నుంచి 15 వరకు లెప్టోస్పిరోసిస్ కేసులు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల 27 ఏళ్ల వ్యక్తి తీవ్ర జ్వరం, ఒళ్లునొప్పి, కిడ్నీ పనితీరు క్షీణించడంతో ఆసుపత్రిలో చేరాడు. తొలుత డెంగీ, వైరల్ ఇన్ఫెక్షన్గా భావించి చికిత్స చేసినా పరిస్థితి మెరుగుపడలేదు. వరద నీటితో సంబంధం ఉన్నట్లు తెలియడంతో వైద్యులు లెప్టోస్పిరోసిస్ను అనుమానించి పరీక్షలు నిర్వహించారు. వ్యాధి నిర్ధారణ కావడంతో యాంటీబయాటిక్స్, కిడ్నీకి సహాయక చికిత్స అందించగా కోలుకున్నట్లు యశోద ఆసుపత్రి ఇన్ఫెక్షియస్ డిసీజ్ నిపుణుడు డాక్టర్ కె. శేషికిరణ్ తెలిపారు.
