
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కార్‌కు కేంద్రం బిగ్ షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రతిపాదన ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ రాజ్యసభలో వెల్లడించింది. కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర అంశాలు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II పరిధిలో ఉన్నందున ప్రస్తుత దశలో టెక్నో ఎకనామిక్ అప్రైజల్ చేపట్టలేమని కేంద్రం తేల్చి చెప్పింది. సమగ్ర ప్రణాళికతో రావాలని సూచిస్తూ ప్రాజెక్టు డీపీఆర్‌ను వెనక్కి పంపినట్లు పేర్కొంది.
తెలంగాణలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించే ప్రతిపాదన ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా.. కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర అంశాలు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II పరిధిలో ఉండటంతో ప్రస్తుత దశలో ప్రాజెక్టుకు టెక్నో ఎకనామిక్ అప్రైజల్ నిర్వహించలేమని వెల్లడించింది. దీంతో ప్రాజెక్టుకు జాతీయ హోదా, కేంద్ర ఆర్థిక సాయం విషయంలో ఇప్పటికిప్పుడు స్పష్టత లేకుండా పోయింది.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి రాజ్యసభలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన, అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ జల అంశాలతో ముడిపడి ఉన్న, గణనీయమైన సాగునీటి సామర్థ్యాన్ని సృష్టించే భారీ సాగునీటి ప్రాజెక్టులకు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం జాతీయ ప్రాజెక్టు హోదా పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది. అయితే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే ప్రతిపాదన ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి అందిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ ప్రాజెక్టులో కృష్ణా నదీ జలాల వినియోగంతో పాటు అంతర్రాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయని పేర్కొంది. ఈ అంశాలు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II పరిధిలో ఉన్నందున ప్రస్తుతం న్యాయపరమైన పరిశీలనలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టుకు అవసరమైన టెక్నో-ఎకనామిక్ అప్రైజల్‌ను ప్రస్తుత దశలో చేపట్టడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది.
