
ఇండోనేషియాలోని అనాక్ క్రకటోవా అగ్నిపర్వతం వరుసగా 25 గంటలపాటు విస్ఫోటనం చెందడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. భారీగా వెలువడిన అగ్నిపర్వత బూడిదతో గగనతలం దట్టంగా కమ్మేయడంతో జకార్తా అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మొత్తం 8 విమానాశ్రయాలను రవాణా శాఖ తాత్కాలికంగా మూసివేసింది.
విమానాశ్రయాల మూసివేతతో సుమారు 2,300 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, దాదాపు 2.7 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద, పొగ కారణంగా విమాన ప్రయాణాలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
అనాక్ క్రకటోవా విస్ఫోటనం, విమాన రాకపోకలపై ప్రభావం, ప్రయాణికుల పరిస్థితిపై పూర్తి వివరాలు మీకోసం.
ఇండోనేషియాలోని ప్రముఖ అగ్నిపర్వతం అనాక్ క్రకటోవా మరోసారి తీవ్రంగా విస్ఫోటనం చెందింది. ఈ ప్రభావంతో దేశంలోని విమానయాన వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 11.07 గంటలకు ప్రారంభమైన ఈ భారీ విస్ఫోటనం దాదాపు 25 గంటల పాటు కొనసాగి, సెప్టెంబర్ 6 ఆదివారం అర్ధరాత్రి 12.04 గంటలకు ముగిసింది.
ప్రస్తుతం అగ్నిపర్వతం నుంచి తక్కువ తీవ్రతతో అప్పుడప్పుడు పొగ, బూడిద వెలువడుతున్నాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు లెవల్-3 అలర్ట్‌ను కొనసాగిస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్థానిక పాఠశాలలను కూడా మూసివేశారు.
అంతేకాకుండా, రాబోయే రోజుల్లో అనాక్ క్రకటోవా నుంచి మరిన్ని విస్ఫోటనలు సంభవించే అవకాశం ఉందని జియోలాజికల్ ఏజెన్సీ హెడ్ లానా సరియా హెచ్చరించారు. దీంతో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
జావా, సుమత్రా దీవుల మధ్య ఉన్న సుండా జలసంధిలోని అనాక్ క్రకటోవా అగ్నిపర్వతానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1883లో క్రకటోవా అగ్నిపర్వతం సంభవించిన భారీ విస్ఫోటనం అనంతరం సముద్ర గర్భం నుంచి అనాక్ క్రకటోవా ఏర్పడింది. అప్పటి నుంచి ఈ అగ్నిపర్వతం తరచూ స్వల్పస్థాయి విస్ఫోటనాలకు గురవుతోంది.
2018లో అనాక్ క్రకటోవా భారీగా విస్ఫోటనం చెందడంతో సుమత్రా, జావా దీవుల తీర ప్రాంతాలను భారీ సునామీ తాకింది. ఈ ఘటనలో సుమారు 430 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న విస్ఫోటనం కారణంగా సునామీ ముప్పు లేదని అధికారులు వెల్లడించారు.
అయినప్పటికీ, అగ్నిపర్వతం నుంచి ఆకాశంలోకి ఎగసిపడుతున్న బూడిద, విష వాయువులు, అత్యంత వేడిగా ఉన్న రాళ్లు, లావా కారణంగా పరిసర ప్రాంతాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు.
ప్రపంచంలోని క్రియాశీల అగ్నిపర్వతాల్లో సుమారు 75 శాతం ఉన్న పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఇండోనేషియా ఉంది. దీంతో ఆ దేశంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి.
