D Educt: Sept 8: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చి, విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (TPS) విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కొత్తగా 73 టీపీఎస్‌ల నిర్మాణానికి రూ.699.89 కోట్ల నిధులతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

ఈ మొత్తం నిధుల్లో రూ.209.96 కోట్లను రాష్ట్ర బడ్జెట్‌ నుంచి కేటాయించనున్నారు. మిగిలిన రూ.489.93 కోట్లను ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB) రుణం ద్వారా సమకూర్చనున్నారు. తాజా అనుమతులతో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల సంఖ్య మొత్తం 78కి చేరింది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను మరింత చేరువ చేయడమే టీపీఎస్‌ల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా ప్రమాణాలతో పాటు ఆధునిక మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది.

టీపీఎస్‌ల ప్రత్యేకతలు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు భిన్నంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ‘సెమీ రెసిడెన్షియల్’ విధానంలో పనిచేయనున్నాయి. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం రెండు నుంచి మూడు ఎకరాల స్థలం ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి, వాటిని అన్ని ఆధునిక మౌలిక వసతులతో అభివృద్ధి చేయనున్నారు.

సమీపంలోని రెండు లేదా మూడు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఈ టీపీఎస్‌లలో విలీనం చేసి ఒక పెద్ద విద్యా క్లస్టర్‌గా తీర్చిదిద్దనున్నారు. వీలున్న ప్రాంతాల్లో సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను కూడా ఈ విద్యా సముదాయంతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

టీపీఎస్‌లలో ఆధునిక డిజిటల్ ల్యాబ్‌లు, సైన్స్ ప్రయోగశాలలు, విశాలమైన గ్రంథాలయాలు, ప్రత్యేక క్రీడా మైదానాలు వంటి సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా ఈ పాఠశాలలను సమగ్ర విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.