
D Spiritual: Nov 17:
వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఇంటికి అనేక నియమాలు ఉంటాయి. దిశల ప్రకారం వస్తువులను అమర్చుకోవడం వల్ల ఇంట్లో శాంతి, ఆనందం, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని నమ్మకం. వాస్తు నియమాలను సరిగా పాటించకపోతే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలను ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయాన్ని పరిశీలిద్దాం. సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం దగ్గర కూర్చోవద్దని పెద్దలు తరచుగా చెబుతూ ఉంటారు. చాలా మందికి ఇది ఎందుకని అనిపిస్తుంది.
ఇంటి ద్వారం అనేది లక్ష్మీదేవి ప్రవేశద్వారంగా భావిస్తారు. సాయంత్రం సమయం లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టే అత్యంత శుభముహూర్తంగా పరిగణిస్తారు. అందువల్ల ఆ సమయంలో ఇంటి గుమ్మం దగ్గర ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలని సూచిస్తారు.
సాయంత్రం పూట గుమ్మం దగ్గర కూర్చుంటే లక్ష్మీదేవి తిరిగి వెళ్లిపోతుందని, దీని వల్ల ఇంట్లో పేదరికం పెరుగుతుందని పెద్దలు నమ్ముతారు. అందుకే సాయంత్రం సమయంలో గుమ్మం వద్ద కూర్చోవద్దని సూచన.
అలాగే ఇంటి ముందు చెప్పులు ఎప్పుడూ పోగులుగా ఉంచకూడదు. ఇంటి గుమ్మం వద్ద కూర్చుని గోర్లను కట్ చేయడం కూడా అసంప్రదాయం. ఇవి ఇంట్లో పేదరికానికి కారణమవుతాయని నమ్మకం. అలాగే గుమ్మం పైన గడియారాలు వంటి వస్తువులను వేలాడదీయకూడదని కూడా చెబుతారు.
