
D Spiritual: Nov 26: గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావించడంతో, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గుడ్లగూబ విగ్రహం ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది ధనం, ఐశ్వర్యం, బుద్ధికి చిహ్నంగా భావించబడుతుంది. గుడ్లగూబ విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోవడంతో పాటు సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం ఉంది. అలాగే ఇది ఆలోచనా శక్తిని పెంచి, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని అందిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వ్యాపారంలో లేదా ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొనే వారికి గుడ్లగూబ విగ్రహం ఎంతో ప్రయోజనం అందిస్తుందని విశ్వాసం.
వాస్తు ప్రకారం గుడ్లగూబ విగ్రహాన్ని ఇంట్లో ఉత్తరం లేదా పడమర దిశలో ఉంచడం అత్యంత శుభప్రదం. ఉత్తర దిశ ధనాన్ని సూచించగా, పడమర దిశ స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇనుము, చెక్క లేదా వెండితో తయారైన గుడ్లగూబ విగ్రహాన్ని కొనుగోలు చేయడం మంచిది. ఈ విగ్రహాన్ని ఎవరూ తరచూ తాకలేని ప్రదేశంలో ఉంచాలి. ప్రతి శుక్రవారం మరియు పౌర్ణమి రోజున ఈ విగ్రహాన్ని శుభ్రం చేసి దీపం వెలిగించడం వల్ల అదృష్టం, ధనం స్థిరంగా ఉంటాయని నమ్మకం. గుడ్లగూబ విగ్రహం కేవలం అలంకార వస్తువు మాత్రమే కాదు; ఇది ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించే శక్తివంతమైన వాస్తు పరిహారంగా పరిగణించబడుతుంది.
