The Paradise: Nani Wanted to Watch the Movie with Fans.. But His Plan Hit a Safety Hurdle!

D News : నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలని నాని భావించారు. ఇందుకోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పోలీసు అధికారులను అనుమతి కోరుతూ నాని విజ్ఞప్తి చేశారు.

ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూడాలని..

సినిమాను ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో చూడటం తనకు ఎప్పటి నుంచో ప్రత్యేకమైన అనుభూతి అని నాని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు సినిమా అభిమానుల సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌ను అక్కడే ప్రేక్షకులతో కలిసి ఆస్వాదించాలని తన కోరికను వెల్లడించారు.

భద్రతకు ప్రాధాన్యం..

తన రాక సందర్భంగా అవసరమైన అన్ని భద్రతా నిబంధనలు, ప్రోటోకాల్స్‌ను పాటిస్తామని నాని హామీ ఇచ్చారు. అయితే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో గతంలో జరిగిన భారీ జనసమీకరణ ఘటనల నేపథ్యంలో ఈ అంశంలో పోలీసుల అనుమతి, క్రౌడ్ మేనేజ్‌మెంట్ కీలకంగా మారింది. 2024 డిసెంబర్‌లో ‘పుష్ప 2’ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.

సీఎం రేవంత్ రెడ్డి స్పందన..

నాని విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రజల భద్రత, జనసమూహ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని పేర్కొంటూ, స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ దరఖాస్తును సంబంధిత పోలీసు బృందం పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటుందని సీఎం తెలిపారు.

దీంతో అభిమానులతో కలిసి ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ చూడాలన్న నాని ప్లాన్‌కు ప్రస్తుతం అధికారిక అనుమతి ప్రక్రియ అవసరమైంది. ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న విడుదల కానుండగా, సెప్టెంబర్ 23న ప్రీమియర్ షోలు జరగనున్నాయి.

By Avinash