
D News: Aug 7: తెలంగాణ సైబర్ భద్రతా విభాగం: డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేపడుతున్న చర్యలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. సైబర్ నేరాల నియంత్రణ, ప్రజల్లో అవగాహన కల్పించడం, బాధితులకు సేవలు అందించడంలో రాష్ట్రం అత్యుత్తమ పనితీరు కనబర్చిందని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నిర్వహించిన జాతీయ స్థాయి ‘ప్రగతి’ సమీక్షలో వెల్లడైంది.
కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) అందించిన డేటా ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును అంచనా వేయగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. సైబర్ నేరాల నివారణ, విచారణ, డిజిటల్ వేదికల వినియోగం, ప్రజలకు సేవలందించే విధానాలను ఈ సమీక్షలో పరిగణనలోకి తీసుకున్నారు.
దేశంలోనే తొలిసారిగా స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (S4C) ఏర్పాటు చేయడం, e-Zero FIR అమలు, గ్రీవెన్స్ రిడ్రెసల్ మాడ్యూల్ (GRM), మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ (MRM), సహయోగ్, సమన్వయ్ పోర్టళ్ల వినియోగం, సైబర్ హాట్‌స్పాట్‌ల గుర్తింపు, అధికారులకు శిక్షణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలు తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టాయి.
ఈ విజయంపై ప్రధానమంత్రి కార్యాలయం తెలంగాణ పోలీసులను ప్రత్యేకంగా అభినందించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ శిఖా గోయల్ ఈ విజయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, ఈ ర్యాంక్ సైబర్ నేరాల నుంచి ప్రజల ఆస్తులను రక్షించడంలో రాష్ట్ర పోలీసుల నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
