
D News: Aug 7: వాతావరణ హెచ్చరిక: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు వర్షాలు కొనసాగనున్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) వెల్లడించింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్‌కు దూరంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.
