
DSports 14Feb 2026:కొలంబో (శ్రీలంక):టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం దాయాది దేశాల మధ్య జరగబోయే మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌లో భారత్ తన బౌలింగ్ విభాగంలో ఒక వ్యూహాత్మక మార్పు చేసే అవకాశం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అంచనా వేశారు. శ్రీలంకలోని పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో, భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
- కొలంబోలోని ప్రేమదాస స్టేడియం పిచ్ సాధారణంగా స్లోగా ఉండి, స్పిన్నర్లకు మంచి సహకారం అందిస్తుంది. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ వంటి ప్రభావవంతమైన స్పిన్నర్ అవసరం జట్టుకు ఉంది. గత మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ తన పూర్తి కోటా (4 ఓవర్లు) బౌలింగ్ చేయకపోవడం, హార్దిక్ పాండ్యా తొలి ఓవర్ వేయడం చూస్తుంటే.. పాక్ మ్యాచ్ కోసం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ప్రణాళికలను ముందే అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జట్టులో ఉన్న అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలతో పాటు కుల్దీప్ కూడా తోడైతే పాక్ బ్యాటర్లను కట్టడి చేయడం సులభమవుతుందని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
- “అర్ష్‌దీప్ తన కోటా పూర్తి చేయలేకపోయాడు. హార్దిక్ తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే తర్వాతి మ్యాచ్‌లో అర్ష్‌దీప్ ఆడకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. శ్రీలంకలో పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి కాబట్టి, పాక్‌తో మ్యాచ్‌లో కుల్దీప్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.” – సునీల్ గావస్కర్
