D Spiritual: Dec 5: ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం పాటు దీపారాధన చేయకూడదు, ఆలయాలకు వెళ్లకూడదు అన్న భావనలు చాలాకాలంగా మన సంప్రదాయాల్లో ఉన్నవే. అయితే ఈ నమ్మకాల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో, పండితులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మామూలుగా ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు మూడు రోజులు, ఐదు రోజులు లేదా 11 రోజుల దినాలు చేస్తారు. ఆ తరువాత దాదాపు సంవత్సరం వరకు ఇంట్లో పూజలు నిర్వహించకూడదని కొందరి నమ్మకం. కొందరు దీపారాధన కూడా చేయరు. దేవాలయాలకు వెళ్లటాన్ని కూడా మానేస్తారు. ఇంట్లో ఉన్న దేవతల ఫోటోలు, విగ్రహాలు, పూజా సామాగ్రి ఒక వస్త్రంలో చుట్టి పక్కన పెడతారు. సంవత్సరం పూర్తి అయిన తర్వాత మాత్రమే అవన్నీ దించి శుభ్రం చేసి పూజలు తిరిగి ప్రారంభిస్తారు. కొన్ని కుటుంబాలు ఈ నియమాన్ని మూడు నెలల వరకూ మాత్రమే పాటిస్తాయి. అయితే నిజంగానే ఏడాది పాటు పూజలు చేయకూడదా? దేవాలయాలకు వెళ్లకూడదా? అనేది చాలామందికి సందేహంగా ఉంటుంది.

హిందూ సంప్రదాయంలో దీపారాధనకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. దీపం అనేది శుభానికి, దైవిక శక్తికి సంకేతం. దీపం వెలిగించిన పూజా స్థలంలో దేవతలు నివసిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల ఏడాది పాటు విగ్రహాలు, పటాలు, పూజా సామగ్రిని పక్కన పెట్టేయడం శాస్త్రపరంగా దోషంగా పరిగణించబడుతుంది. అందుకే పండితుల ప్రకారం, మరణానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తయ్యాక యథావిధిగా దీపారాధన మరియు నిత్య పూజలను వెంటనే పునఃప్రారంభించవచ్చు. పూజలన్నీ నిరభ్యంతరంగా చేయడానికి ఎలాంటి అడ్డంకీ లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

ఇప్పుడు దేవాలయాలకు వెళ్లడంపై పండితుల అభిప్రాయం చూద్దాం. తల్లి లేదా తండ్రి మరణించినప్పుడు, సంప్రదాయం ప్రకారం కొందరు ఒక సంవత్సరం వరకు దేవాలయాలకు వెళ్లకుండా ఉంటారు. అయితే ఇది తప్పనిసరి నియమం కాదు. ముఖ్యంగా, మీకు రోజూ దేవాలయానికి వెళ్లే అలవాటు ఉంటే, ఏ సంకోచం లేకుండా ఆలయ దర్శనం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. తీర్థం కూడా తీసుకోవచ్చట.

అయితే ఒక విషయం మాత్రం గమనించాలి. ఈ సమయంలో ఆలయ పూజా సేవల్లో పాల్గొనకూడదు. అంటే శఠగోపం పెట్టించుకోవడం, రుద్రపాదాలు తీసుకోవడం, ప్రత్యేక సేవలు చేయించడం, దేవాలయ ఉత్సవాల్లో పాల్గొనడం—ఇవన్నీ సంవత్సరం పాటు చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే పండుగలు, తీర్థయాత్రలు, పుణ్యనదుల్లో స్నానాలు వంటి పవిత్ర కార్యాల్లో పాల్గొనకుండా దూరంగా ఉండాలంటున్నారు.

మొత్తం చూస్తే, దినాలు పూర్తయ్యాక నిత్య పూజలు, దీపారాధన చేసుకోవచ్చు, కానీ ప్రత్యేక సేవలు, ఉత్సవాలు మాత్రం సంవత్సరం పాటు మానుకోవడం శాస్త్రానికి అనుగుణం అని పండితుల అభిప్రాయం.