
D Spiritual: Nov 14: పూజ సమయంలో చేసే చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారితీస్తాయని పండితులు చెబుతున్నారు. నిత్యం ఇంట్లో దీపారాధన చేసే వారు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తారు. వీటి వల్ల పూజా ఫలితం తగ్గిపోవడమే కాక, అనవసర సమస్యలు కూడా వస్తాయని విశ్వసిస్తారు. అందుకే పూజ సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.
పూజలో శివలింగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శివలింగంలో విశ్వ శక్తి ఉందని నమ్మకం. అందువల్ల పూజ సమయంలో కానీ, ఇతర సమయాల్లో కానీ శివలింగాన్ని నేలపై ఖాళీగా ఉంచకూడదని చెబుతున్నారు. ఎల్లప్పుడూ శుభ్రమైన ప్రదేశంలో, పీటపై లేదా పూజా పీఠంలోనే ఉంచాలి. విగ్రహాలను శుభ్రం చేసే సమయంలో కూడా నేలపై ఉంచడం తప్పు అని పండితులు హెచ్చరిస్తున్నారు.
దేవుడి గది శుభ్రం చేసే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. విగ్రహాలను నేలపై ఉంచడం దేవతలను అవమానించినట్లుగా భావిస్తున్నారు. దీనివల్ల ఇంట్లో సుఖశాంతులు తగ్గిపోతాయని కూడా చెబుతారు. అందుకే అవసరమైనప్పుడు మాత్రమే పూజా పీఠంపై లేదా మంటపంలో విగ్రహాలను జాగ్రత్తగా ఉంచాలి.
దీపం వెలిగించడం పూజలో అత్యంత శుభప్రదమైన చర్య. కానీ దీపాన్ని వెలిగించి నేలపై నేరుగా ఉంచకూడదట. ఆ దీపం కింద కనీసం అక్షింతలు లేదా పువ్వు ఉంచాలని శాస్త్రోక్తంగా సూచిస్తున్నారు. ఇది శుభసూచకంగా భావించబడుతుంది.
హిందూ మతంలో శంఖానికి ప్రత్యేక స్థానం ఉంది. దేవాలయాల్లో శంఖాన్ని ఊదడం శుభకార్య సూచనగా భావిస్తారు. ఇంట్లో శంఖం ఉంచుకోవడం మంచిదే కానీ, అందులో నింపే నీటిని ప్రతిరోజూ మార్చాలి. అలాగే పూజ సమయాల్లో శంఖం ఊదే ఇంటిలో లక్ష్మీదేవి నివసిస్తారని అంటారు. అయితే శంఖాన్ని నేలపై పెట్టడం చాలా అపశకునంగా భావిస్తారు. ఇలా చేస్తే ధననష్టం కలుగుతుందని చెబుతున్నారు.
శాలిగ్రామం విష్ణువు ప్రతీక. శాలిగ్రామాన్ని అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది ఉన్న ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు స్థిరంగా ఉంటాయని నమ్మకం. కానీ శాలిగ్రామాన్ని నేలపై ఉంచడం పెద్ద తప్పు అని పండితులు చెబుతున్నారు. ఎల్లప్పుడూ పుష్పం, అక్షింతలు లేదా పీఠంపై ఉంచాలి.
