
అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని భారత్‌లో నకిలీ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సైబర్ మోసగాళ్ల ముఠా గుట్టును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రట్టు చేసింది. ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్ చేసి, డ్రగ్స్ అక్రమ రవాణా, మనీలాండరింగ్ కేసుల్లో చిక్కుకున్నారని బెదిరిస్తూ బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంలో తాజాగా మరో నలుగురిని ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరింది.
అమెరికన్లను భయపెట్టి సాగించిన ఈ భారీ మోసం ద్వారా ముఠా ఇప్పటివరకు ఏకంగా రూ.261 కోట్లు కొల్లగొట్టినట్లు డిజిటల్ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. 2025 జూలై నుంచి 2026 సెప్టెంబర్ మధ్య 927 లావాదేవీల ద్వారా 27.39 మిలియన్ అమెరికన్ డాలర్లను వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
20 లక్షల మంది వివరాలతో టార్గెట్
ఈ ముఠా సుమారు 20 లక్షల మంది అమెరికా పౌరులకు సంబంధించిన ఫోన్ నంబర్లు, పేర్లు, చిరునామాలు, వయసు వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. జర్మనీ, ఫిన్లాండ్లో ఏర్పాటు చేసిన సర్వర్ల సహాయంతో ఆటో డయలర్లను ఉపయోగించి లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులకు కాల్స్ చేసేది.
మొదట బాధితుల బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని, వారి కంప్యూటర్లలో వైరస్ ఉందని నమ్మించేవారు. అనంతరం తాము అమెరికా ప్రభుత్వానికి చెందిన డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA), డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అధికారులమని పరిచయం చేసుకునేవారు. డ్రగ్స్ కేసులు, మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ చేస్తామని బెదిరించేవారు. నకిలీ గుర్తింపు కార్డులు, అధికారిక బ్యాడ్జీలు, కోర్టు ఉత్తర్వులను చూపించి బాధితుల్లో భయాన్ని పెంచేవారు.
మూడు విభాగాలుగా మోసానికి స్కెచ్
కాల్ సెంటర్లలో ఈ ముఠా పక్కా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఇందులో సిబ్బందికి మూడు రకాల బాధ్యతలు అప్పగించేవారు. మొదట డయలర్లు బాధితులకు ఫోన్ చేసి మాట్లాడి వారి నమ్మకాన్ని పొందేవారు. ఆ తర్వాత బ్యాంకర్లుగా వ్యవహరించే సిబ్బంది బాధితుల బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించేవారు.
చివరిగా క్లోజర్లు రంగంలోకి దిగి అమెరికా ప్రభుత్వ అధికారులుగా నటించేవారు. అరెస్ట్ చేస్తామని, బ్యాంకు ఖాతాల్లోని నగదును సీజ్ చేస్తామని బెదిరించేవారు. దీంతో బాధితులు భయపడి నగదు, బంగారం, గిఫ్ట్ కార్డులు, బ్యాంకు బదిలీల రూపంలో డబ్బులు సమర్పించుకునేవారు.
ఈ వ్యవహారంలో పంజాబ్‌లోని పటియాలాలో రెండు, మహారాష్ట్రలోని పుణెలో ఒకటి చొప్పున మొత్తం మూడు నకిలీ కాల్ సెంటర్లను ఈడీ గుర్తించింది. తనిఖీల సమయంలో వందలాది మంది సిబ్బంది ఈ కేంద్రాల్లో పనిచేస్తున్నట్లు వెల్లడైంది. పటియాలాలోని కాల్ సెంటర్లలోనే 242 మంది సిబ్బందిని నియమించినట్లు దర్యాప్తులో తేలింది.
క్రిప్టో, హవాలా మార్గాల్లో రూ.261 కోట్ల తరలింపు
మోసం ద్వారా సంపాదించిన డబ్బును నేరుగా భారత్‌కు తరలించకుండా నిందితులు అంతర్జాతీయ ఆర్థిక మార్గాలను ఉపయోగించినట్లు ఈడీ గుర్తించింది. అమెరికాలోని మ్యూల్ బ్యాంకు ఖాతాలు, దుబాయ్, హాంకాంగ్‌కు చెందిన కంపెనీల ద్వారా నగదును వివిధ ఖాతాలకు మళ్లించారు.
ఆ తర్వాత క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్, హవాలా, అంగడియా మార్గాల ద్వారా ఆ మొత్తాన్ని భారత రూపాయల్లోకి మార్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటివరకు 549 మంది అమెరికా పౌరులను బాధితులుగా గుర్తించారు. మొత్తం 6,463 ఫోన్ నంబర్లకు కాల్స్, మెసేజ్‌లు పంపినట్లు ఆధారాలు లభించాయి. అలాగే 397 అమెరికా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా మరో నలుగురి అరెస్ట్
ఈ భారీ ఆర్థిక మోసం కేసులో హర్షిల్ రావల్, జస్వంత్ సింగ్, చేతన్ ముంజాల్, ప్రణవ్ పిథాడియాలను ఈడీ తాజాగా అరెస్ట్ చేసింది. అంతకుముందు మరో ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసినట్లయింది.
నిందితులను నాంపల్లిలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. మరోవైపు ఈ ముఠా అక్రమంగా సంపాదించిన డబ్బు ఎవరెవరికి చేరింది? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అక్రమ సంపాదనతో ఎన్ని ఆస్తులు కొనుగోలు చేశారు? అనే అంశాలపై ఈడీ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
