
పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడటం కలకలం రేపింది. రైల్వే పోలీసులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి వద్ద ఏకంగా రూ.1 కోటి 40 లక్షల నగదు బయటపడింది. భారీ మొత్తంలో డబ్బును చూసిన పోలీసులు, అక్కడున్న ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
అసలు వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని అత్యంత రద్దీగా ఉండే ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మూడు బ్యాగులతో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడి ప్రవర్తనలో భయాందోళనలు కనిపించడంతో పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను గమనించిన ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని బ్యాగులను తనిఖీ చేశారు. అందులో పెద్ద సంఖ్యలో నగదు కట్టలు కనిపించడంతో అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. బ్యాగుల్లో ఉన్న డబ్బును లెక్కించేందుకు ప్రత్యేకంగా కౌంటింగ్ మెషిన్‌ను తీసుకొచ్చారు. రైల్వే స్టేషన్లోనే నగదును లెక్కించగా మొత్తం రూ.1.40 కోట్లుగా తేలింది.
ఈ నగదులో రూ.500 నోట్ల కట్టలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 280 కట్టల్లో సుమారు రూ.1.40 కోట్ల నగదు ఉన్నట్లు వెల్లడైంది. భారీ మొత్తంలో నోట్లను లెక్కించే క్రమంలో అక్కడి కౌంటింగ్ మెషిన్ సైతం ఆగకుండా పనిచేయాల్సి వచ్చింది.
పోలీసుల విచారణలో పట్టుబడిన వ్యక్తి పేరు రాహుల్ సోనీ (36) అని, అతడు హౌరాలోని జీటీ రోడ్ ప్రాంతానికి చెందినవాడని వెల్లడైంది. జార్ఖండ్‌లోని టాటానగర్ నుంచి హౌరాకు ఈ నగదును తీసుకెళ్తున్నట్లు అతడు పోలీసులకు తెలిపాడు.
అయితే ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎందుకు తీసుకెళ్తున్నాడు? అనే ప్రశ్నలకు రాహుల్ సరైన సమాధానాలు ఇవ్వలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పోలీసులు నగదుకు సంబంధించిన వివరాలు, దాని వెనుక ఉన్న వ్యక్తులు, అసలు వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
