D News: Aug 10: రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన జూనియర్ డాక్టర్ ప్రియాంక కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలను నేడు స్వగ్రామమైన జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఏక్లాస్‌పూర్ గ్రామంలో నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆమెకు తుది వీడ్కోలు పలకనున్నారు. హైదరాబాద్‌లో పోస్టుమార్టం పూర్తైన అనంతరం ప్రియాంక భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నారు. మధ్యాహ్నం నాటికి ఏక్లాస్‌పూర్ చేరుకోనున్న పార్థివదేహానికి గ్రామంలోనే అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

ఏక్లాస్‌పూర్‌కు చెందిన ప్రియాంక రెండో తరగతి వరకు ఐజలోనే విద్యాభ్యాసం చేశారు. అనంతరం పిల్లలకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఆమె తల్లిదండ్రులు కర్నూలుకు మకాం మార్చారు. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన ప్రియాంక.. కుటుంబంలో పెద్ద కుమార్తెగా బాధ్యతగా చదువుకుని ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వైద్యురాలిగా మంచి భవిష్యత్తును నిర్మించుకునే దిశగా ముందుకు సాగారు.

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వైద్య విద్యలో ఉన్నత స్థాయికి చేరుకుని భవిష్యత్తులో ఎంతోమంది రోగులకు సేవలు అందించాలనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతున్నారు.

అయితే రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్ని విషాదాంతం చేసింది. రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్‌ వద్ద సినిమా చూసి స్కూటీపై తిరిగి వస్తుండగా.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారుతో ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని తీవ్రంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం అనంతరం ప్రియాంకను మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సుమారు ఏడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన ఆమె.. ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎంతో ప్రతిభావంతురాలైన యువ వైద్యురాలు అకాల మరణం చెందడం కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, వైద్య వర్గాలను తీవ్ర విషాదంలో ముంచింది.

భవిష్యత్తులో ఎంతోమందికి వైద్యం అందించాల్సిన యువ వైద్యురాలు ఇలా అకాలంగా మృతి చెందడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది. ప్రియాంక మృతితో ఆమె స్వగ్రామమైన ఏక్లాస్‌పూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.