
హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నల్సార్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, వర్సిటీ అధికారులకు మధ్య వివాదం చెలరేగింది. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా భారత ప్రధానన్యాయమూర్తి సూర్యకాంత్‌ను ఆహ్వానించడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల తీరును తప్పుపడుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణమని విద్యార్థులు పేర్కొంటున్నారు. రాజ్యాగ విలువల పరిరక్షణే లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ దాదాపు 350 నుంచి 450 మంది విద్యార్థులు వర్సిటీకి వినతిపత్రాలు సమర్పించారు.
హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్) విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, వర్సటీ అధికారుల మధ్య వివాదం చెలరేగింది. రానున్న స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ప్రధానన్యాయమూర్తి సూర్యకాంత్‌ను ఆహ్వానించాలన్న వర్సటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు వివిధ బ్యాచ్‌లకు చెందిన సుమారు 350 నుంచి 450 మంది విద్యార్థులు వర్సిటీ పరిపాలనా విభాగానికి ఆరు వేర్వేరు వినతిపత్రాలను సమర్పించారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండేలా ఈ ఆహ్వానాన్ని పునఃపరిశీలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువత చలో సంసద్ ఆందోళన చేపట్టగా.. నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల దౌర్జన్యం, అణచివేతకు సంబంధించిన ఆరోపణల విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని విద్యార్థులు తమ లేఖల్లో పేర్కొన్నారు. ‘మాకు వీడియోల పట్ల ఆసక్తి లేదు.. చూసేందుకు మాకు సమయం లేదు.. మా సమయాన్ని వృథా చేయవద్దుట అంటూ న్యాయస్థానంలో ఆయన చేసిన వ్యాఖ్యలు బాధ్యతాయుతంగా లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన అత్యున్నత న్యాయస్థానం నుంచి ఇలాంటి స్పందన రావడం తీవ్ర నిరాశను కలిగించిందని వారు అభిప్రాయపడ్డారు.
సాధారణంగా ప్రతి ఏటా నల్సార్ స్నాతకోత్సవానికి భారత ప్రధానన్యాయమూర్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, విశ్వవిద్యాలయం తమకు నేర్పిన రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ వంటి అంశాలకు ఈ ఆహ్వానం విరుద్ధంగా ఉందని విద్యార్థులు వాదిస్తున్నారు. ‘ఒక విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం అనేది కేవలం డిగ్రీలను ప్రదానం చేసే వేడుక మాత్రమే కాదు. అది సంస్థ నమ్మే విలువలకు అద్దం పట్టాలి. పోలీసుల దౌర్జన్యాలను తేలికగా తీసుకునే ప్రముఖుల చేతుల మీదుగా పట్టాలు అందుకోవడం మా విద్యార్థి లోకానికి ఇబ్బందికరంగా ఉంది’ అని విద్యార్థులు తమ లేఖల్లో స్పష్టం చేశారు.
