D NEWS: సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరాలంటే ప్రభుత్వ ఉద్యోగులే కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ నూతన కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రజలకు అందించే సేవలపై పలు సూచనలు చేశారు.

సాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలను ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులుగా భావించాలని సీఎం సూచించారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు.

రాష్ట్రంలో 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సుమారు 4 కోట్ల మంది ప్రజలకు సేవలు అందిస్తున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. మూడు శాతం మంది ఉద్యోగులు 97 శాతం ప్రజలకు సేవ చేయడం శ్రమతో కూడిన పని అయినప్పటికీ బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా ఉద్యోగుల పనితీరుతో సంబంధం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ప్రజల కోసం చట్టాలు చేసినా, నిధులు కేటాయించినా వాటి ప్రయోజనాలను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ఉద్యోగులదేనని స్పష్టం చేశారు.

అందరి సహకారంతో సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. పేదల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ కార్యాలయాలు వేదికలుగా పనిచేయాలని సూచించారు. సమీక్షలో కేంద్రమంత్రి బండి సంజయ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.