
రాజమండ్రికి చెందిన మెడికో ప్రియాంక మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశారు. ఆగస్టు 3న మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అప్పటి నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెను బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటలకు ప్రియాంక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత రాజమండ్రిలో చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంలో కారు టైర్ మెడపై నుంచి వెళ్లడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఆమె పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రియాంకను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆమెకు అప్నియా టెస్ట్ నిర్వహించేందుకు ప్రయత్నించినప్పటికీ శరీరం సహకరించలేదని వైద్యులు పేర్కొన్నారు. శరీరంలో సోడియం స్థాయిలు 16 కంటే తక్కువగా ఉండటంతో పరీక్ష నిర్వహించడం సాధ్యం కాలేదని తెలిపారు.
