
D News: Oct 15: విజయవాడలోని పున్నమి ఘాట్‌లో జాతీయ సరస్ మేళా ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు, వారి నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు వేదికగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి లాంఛనంగా ప్రారంభించారు. మహిళా స్వయం ఉపాధి, గ్రామీణ ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా ఈ మేళాను నిర్వహిస్తున్నారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో విజయవాడలో జాతీయ సరస్ మేళా నిర్వహించడం సంతోషకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీ తర్వాత తొలిసారిగా విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పేద కుటుంబంలో జన్మించి, ఎన్నో కష్టాలను ఎదుర్కొని దేశ ప్రథమ పౌరురాలిగా ఎదిగిన ఆమె జీవితం మహిళలందరికీ ఆదర్శమని కొనియాడారు. మహిళలు సంకల్పిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ద్రౌపది ముర్ము నిరూపించారని ప్రశంసించారు.
మహిళా శక్తిని దేశానికి చాటిచెప్పాలనే ఉద్దేశంతోనే విజయవాడలో ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు వివరించారు. ఇందులో ఏర్పాటు చేసిన 650 స్టాళ్లు మహిళల నైపుణ్యానికి, సృజనాత్మకతకు నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామీణ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం, మహిళలకు కొత్త వ్యాపార అవకాశాలను కల్పించడం ఈ మేళా ప్రధాన లక్ష్యాలని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కుటుంబాలు, రాష్ట్రం, దేశం పురోగమిస్తాయని అన్నారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు జాతీయ బ్రాండ్లుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ప్రారంభించిన డ్వాక్రా ఉద్యమం నేడు దేశవ్యాప్తంగా విస్తరించి, మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడుతోందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. డ్వాక్రా సంఘాలు ప్రస్తుతం రూ.69 లక్షల కోట్ల రుణాలు తీసుకుంటూ, రూ.లక్ష కోట్ల టర్నోవర్‌తో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ టర్నోవర్‌ను భవిష్యత్తులో రూ.10 లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
త్వరలోనే రాష్ట్రంలో పది లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా చూడబోతున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మందిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం ప్రశంసనీయమని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య ఆశయమని వెల్లడించారు.
