
వనపర్తి జిల్లా ఖిల్లాఘనపూర్ మండలంలో వరుసగా జరుగుతున్న దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. మేకలు, గొర్రెల చోరీలతో పాటు రాత్రి వేళల్లో ఇళ్లలో జరిగిన దొంగతనాలకు పాల్పడిన నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
ఖిల్లాఘనపూర్, నవంబర్ 5: ఖిల్లాఘనపూర్ మండలంలో మేకలు, గొర్రెల దొంగతనాలు, ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఖిల్లాఘనపూర్ బస్టాండ్ వద్ద ఎస్ఐ వెంకటేష్ తన సిబ్బందితో కలిసి గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మానాజీపేట రోడ్డు వైపు నుంచి ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు మేకను తీసుకువస్తుండటాన్ని పోలీసులు గమనించారు.
అనుమానం రావడంతో వారిని అడ్డుకుని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు. ఈ క్రమంలో దొంతికుంట తండా, కర్నె తండా ప్రాంతాల్లో మేకలు, గొర్రెలను దొంగిలించి విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడైంది.
ఈ కేసులో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులతో పాటు, చోరీ చేసిన పశువులను కొనుగోలు చేసిన మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ముగ్గురినీ రిమాండ్కు తరలించారు. వరుస దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు.
