
D Spiritual: Dec 4: ఇప్పుడు మనం తెలుసుకోబోయే కొన్ని మొక్కలు ఇంటిని అందంగా మార్చడంతో పాటు ఇంట్లో ఉన్న నెగటివిటీని దూరం చేస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలామంది వాస్తు ప్రకారం మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే కొందరు తెలియక పెంచకూడని మొక్కలను కూడా పెంచుతూ ఉంటారు. అవి అందంగా కనిపించినప్పటికీ ప్రతికూలతలను ఆకర్షిస్తాయని చెబుతున్నారు. కానీ ఇప్పుడు చెప్పబోయే మొక్కలు ఇంటిని అందంగా ఉంచడంతో పాటు సానుకూలతను కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు.
ఇందులో ముఖ్యంగా ఉండవలసిన మొక్క తులసి. హిందువులు తులసిని పవిత్రంగా భావిస్తూ నిత్య పూజలు చేస్తుంటారు. దాదాపు ప్రతి ఇంటి ముందు తులసి తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్క ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక ఫలితాలను కూడా కలిగిస్తుంది. ఈ మొక్క ఇంట్లోని ప్రతికూలతను తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందని చెబుతున్నారు.
తదుపరి ఇంట్లో ఉండవలసిన మొక్కల్లో స్నేక్ ప్లాంట్ ఒకటి. ఇది చూడటానికి ఎంతో అందంగా ఉండటంతో అనేక మంది దీనిని ఇండోర్ ప్లాంట్‌గా పెంచుతారు. ఈ మొక్క గాలిలో ఉన్న హానికరమైన టాక్సిన్స్ ను తొలగించి గాలిని శుద్ధి చేస్తుంది. ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమై, సానుకూల వాతావరణం ఏర్పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో శుభాన్ని, ఆనందాన్ని తెచ్చే మరో మొక్క పీస్ లిల్లీ. ఇది ఉన్న ప్రదేశం ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. గాలిని శుద్ధి చేయడంతో పాటు టాక్సిన్స్‌ను తొలగించే ప్రత్యేకత కూడా దీనిలో ఉంది. అందువల్ల పీస్ లిల్లీని ఇంట్లో ఉంచడం సానుకూలతను పెంచుతుంది.
మనీ ప్లాంట్‌ను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మొక్క ఎలా ఎదుగుతుందో, ఇంట్లో సుఖసంతోషాలు కూడా అలాగే పెరుగుతాయని నమ్మకం. అదృష్టానికి చిహ్నంగా భావించే ఈ మొక్కను ఇంట్లో పెట్టుకుంటే ఆర్థికంగా, మానసికంగా ఎదుగుదల పెరుగుతుందని అంటారు.
తులసి, మనీ ప్లాంట్ తర్వాత కలబంద (అలోవెరా) మొక్క కూడా భారతదేశంలోని అనేక ఇళ్లలో కనిపిస్తుంది. కలబంద అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడమే కాకుండా ఇంట్లోని ప్రతికూలతను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. తక్కువ నీటితో సులభంగా పెరుగుతుందనే కారణంతో చాలా మంది ఈ మొక్కను ఇంట్లో పెంచుతారు.
