పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ ప్రజలకు ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం భారీ ఊరట ప్రకటించింది. సామాన్య ప్రజలకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా ప్రత్యేక పెట్రోల్ సబ్సిడీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ పథకం కింద మోటార్‌సైకిళ్లు, రిక్షాలు, ఇతర ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు నడిపేవారికి నెలకు గరిష్ఠంగా 20 లీటర్ల పెట్రోల్‌పై లీటరుకు రూ.100 సబ్సిడీ అందించనున్నారు. అలాగే 800 సీసీ వరకు ఉన్న చిన్న కార్ల యజమానులకు నెలకు గరిష్ఠంగా 30 లీటర్ల పెట్రోల్‌పై లీటరుకు రూ.100 సబ్సిడీ లభిస్తుంది.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.370కు పైగా ఉన్న నేపథ్యంలో సబ్సిడీ లభించిన తర్వాత అర్హులైన వినియోగదారులు లీటరుకు సుమారు రూ.270 చెల్లించాల్సి ఉంటుంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో పాకిస్తాన్‌లో ఇంధన ధరలు కూడా భారీగా పెరిగాయి.

ఈ పరిస్థితుల్లో ప్రజలపై పడుతున్న ఆర్థిక భారంపై ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని షాబాజ్ షరీఫ్ తెలిపారు. “ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటాం” అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని కార్యాలయం ప్రకారం, ఈ పథకం మొదట ఇస్లామాబాద్‌లో అమల్లోకి వచ్చింది. అనంతరం బుధవారం గురువారాల మధ్య రాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

సబ్సిడీ పొందేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచారం నిర్వహించడంతో పాటు, మోటార్‌సైకిళ్లు, రిక్షాలు, చిన్న కార్లను ఎలా రిజిస్టర్ చేసుకోవాలనే దానిపై అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. పెట్రోల్ ధరల పెరుగుదలపై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో షాబాజ్ షరీఫ్ ఈ సబ్సిడీ పథకాన్ని ప్రకటించడం గమనార్హం.

By Rajini