Nalgonda Student Sreeja Reddy Goes Missing in America, Boston Police Launch Search Operation

Nalgonda Student Missing in USA: ఉన్నత చదువులు అభ్యసిస్తూ ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన నల్లగొండ జిల్లాకు చెందిన యువతి శ్రీజ రెడ్డి కోయ అదృశ్యమైంది. బోస్టన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో చదువుకుంటున్న ఆమె నవంబర్ 2వ తేదీ రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. స్నేహితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఏకైక కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దులాపురం గ్రామానికి చెందిన కోయ యాదగిరిరెడ్డి, రూప దంపతుల ఏకైక కుమార్తె శ్రీజ రెడ్డి కోయ. చిన్నప్పటి నుంచే ఉన్నత చదువులు చదివి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగింది. ఈ క్రమంలో ఏడాది క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. బోస్టన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో చదువుకుంటూనే పార్ట్‌టైం ఉద్యోగం చేస్తోంది. కుమార్తె చదువులో రాణిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటుండటంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

అయితే నవంబర్ 2వ తేదీ సోమవారం రాత్రి జరిగిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రాత్రి సుమారు 9.45 గంటల సమయంలో బోస్టన్‌లోని డోర్చెస్టర్ ప్రాంతం ఎడిసన్ గ్రీన్‌లో ఉన్న తన నివాసం నుంచి శ్రీజ బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో స్నేహితులు ఆందోళన చెందారు. ఆమెకు ఫోన్ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో చివరకు నవంబర్ 3న బోస్టన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన బోస్టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నవంబర్ 4న అధికారికంగా మిస్సింగ్ పర్సన్ అలర్ట్ జారీ చేసింది. అప్పటి నుంచి శ్రీజ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మొబైల్ లొకేషన్ ఆధారంగా బీచ్ పరిసరాల్లో గాలింపు

శ్రీజ ఎక్కడికి వెళ్లింది? ఏం జరిగింది? అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఆమె మొబైల్ ఫోన్‌కు సంబంధించిన చివరి లొకేషన్ ఆధారంగా పోలీసులు పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టినట్లు సమాచారం. ముఖ్యంగా కార్సన్ బీచ్, హార్బర్ పాయింట్ పరిసర ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆమె అదృశ్యానికి సంబంధించిన వివరాలను సేకరిస్తూ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

కుమార్తె కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు

అమెరికాలో పోలీసుల గాలింపు కొనసాగుతుండగా.. స్వగ్రామంలో శ్రీజ తల్లిదండ్రులు కూతురు రాక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపిన తమ ఏకైక కుమార్తె ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో యాదగిరిరెడ్డి, రూప దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. రోజులు గడుస్తున్నా ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. శ్రీజ క్షేమంగా తిరిగి రావాలని బంధువులు, గ్రామస్థులు ఆకాంక్షిస్తున్నారు. అమెరికాలోని తెలుగు సంఘాలు, భారతీయ సమాజం కూడా ఆమె ఆచూకీ కనుగొనేందుకు సహకరించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చొరవ

నల్లగొండ జిల్లాకు చెందిన యువతి అమెరికాలో అదృశ్యం కావడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి.. అమెరికా ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరిపి శ్రీజ ఆచూకీ కనుగొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో చొరవ చూపారు. తమ కుమార్తె క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *