ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ఆయన చిన్ననాటి స్నేహితుడు అస్గర్ అలీ వోరాకు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదంలో ఊరట లభించింది. మహారాష్ట్రలోని మీరా-భాయందర్‌లో వివాదాస్పదంగా మారిన భూమిపై తన హక్కును వదులుకుంటున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా ప్రకటించారు. ఆ స్థలానికి మంజూరైన నిర్మాణ అనుమతిని కూడా తిరిగి అప్పగిస్తున్నట్లు తెలిపారు.

81 ఏళ్ల అస్గర్ అలీ వోరా గుజరాత్‌లోని వడ్నగర్‌లో నరేంద్ర మోదీతో కలిసి చదువుకున్నారు. భాయందర్ ఈస్ట్‌లోని నవ్‌ఘర్ ప్రాంతంలో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని 1989లో రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేసినట్లు వోరా చెబుతున్నారు. అయితే 2011లో తనకు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించి భూమిని రెండు భాగాలుగా విభజించారని ఆయన ఆరోపించారు. అందులో ఒక భాగాన్ని స్వయం బిల్డర్స్‌కు, మరో భాగాన్ని నరేంద్ర మెహతాతో సంబంధం ఉన్న సెవెన్ ఎలెవెన్ కన్‌స్ట్రక్షన్స్‌కు కేటాయించినట్లు వోరా పేర్కొన్నారు.

ఈ భూ వివాదంపై వోరా సెప్టెంబర్ 8న ప్రధాని మోదీని కలిశారు. తన భూమిపై హక్కును పునరుద్ధరించడంతో పాటు, పత్రాల అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. వోరా ప్రధానిని కలిసిన అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు.

ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీకర్ పరదేశీ అధ్యక్షతన మంత్రాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వోరాతో పాటు నరేంద్ర మెహతా, మీరా-భాయందర్ మున్సిపల్ కమిషనర్ రాధా వినోద్ శర్మ, టౌన్ ప్లానర్ పురుషోత్తం షిండే హాజరయ్యారు. సమావేశం సందర్భంగా వివాదాస్పద స్థలంపై తన ఆధిపత్యాన్ని వదులుకుంటున్నట్లు నరేంద్ర మెహతా టౌన్ ప్లానింగ్ శాఖకు లేఖ ఇచ్చారు. అలాగే ఆ స్థలానికి సంబంధించిన నిర్మాణ అనుమతిని కూడా తిరిగి అప్పగిస్తున్నట్లు తెలిపారు.

By Rajini