
పరీక్షలు ప్రశ్నలు అవసరమైతే విమర్శలను ఎదుర్కొనేందుకు న్యాయవ్యవస్థ సిద్ధంగా ఉండాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యాయవ్యవస్థ బాధ్యతాయుత సంస్థగా కొనసాగాలంటే నిజాయతీతో కూడిన నిర్మాణాత్మక విమర్శలు అవసరమని పేర్కొన్నారు.
సోమవారం ఇక్కడ జరిగిన ఆరో రామ్ జఠ్మలానీ స్మారక ఉపన్యాసంలో ఆయన మాట్లాడారు. న్యాయవ్యవస్థ ప్రజా విశ్వాసాన్ని పొందాలంటే ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు, విమర్శలకు సమాధానం చెప్పే స్థాయిలో ఉండాలని అన్నారు.
‘ప్రజా విశ్వాసం’, ‘ప్రజల ఆమోదం’ రెండూ వేర్వేరు అంశాలని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ప్రజలకు నచ్చే తీర్పులు ఇవ్వడం లేదా ప్రజాదరణ పొందడం ద్వారా న్యాయవ్యవస్థకు చట్టబద్ధత రాదని తెలిపారు. ప్రజల ఆమోదం లభించినంత మాత్రాన దాన్ని ప్రజా విశ్వాసంగా పరిగణించలేమన్నారు.
ఒక కేసులో ఓడిపోయిన వ్యక్తి సైతం న్యాయ ప్రక్రియ నిష్పాక్షికంగా నిజాయతీగా సాగిందని విశ్వసించినప్పుడే న్యాయవ్యవస్థ నిజమైన ప్రజా విశ్వాసాన్ని పొందినట్లవుతుందని సీజేఐ పేర్కొన్నారు.
