
DSports Jan09 2026:కౌలాలంపూర్: భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మలేషియా ఓపెన్ 2026 సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జపాన్ అగ్రశ్రేణి క్రీడాకారిణి, మూడో సీడ్ అకానె యమగుచి గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలగడంతో సింధును విజేతగా ప్రకటించారు.
తొలి సెట్లో ఆధిపత్యం: మ్యాచ్ ప్రారంభం నుంచే సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. కేవలం 11-12 నిమిషాల్లోనే మొదటి గేమ్‌ను 21-11 తేడాతో కైవసం చేసుకున్నారు.
యమగుచి నిష్క్రమణ: మోకాలికి కట్టు (Knee brace) కట్టుకుని కోర్టులోకి దిగిన యమగుచి, మొదటి సెట్ ముగిసిన తర్వాత నొప్పి తీవ్రం కావడంతో ఆటకు స్వస్తి పలికారు. దీంతో సింధు సునాయసంగా తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు.
రికార్డుల వేట: ఈ విజయంతో యమగుచిపై సింధు హెడ్-టు-హెడ్ రికార్డు 15-12కి మెరుగుపడింది. గత ఎనిమిదేళ్లలో మలేషియా ఓపెన్ సెమీస్‌కు సింధు చేరుకోవడం ఇదే తొలిసారి.
