
దేవాలయంలోనూ బాలికలకు భద్రత కరువైందా? పూజలు చేసుకునేందుకు శివాలయానికి వెళ్లిన పదేళ్ల చిన్నారికి చేదు అనుభవం ఎదురైంది. శివలింగానికి పూజలు చేస్తుండగా అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మహారాష్ట్రలోని పుణెలో ఈ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. నిగ్డీ ప్రాంతంలోని ఓ శివాలయానికి పదేళ్ల బాలిక ఒంటరిగా వెళ్లింది. అక్కడ శివలింగం ముందు మోకాళ్లపై కూర్చొని భక్తితో పూజలు నిర్వహిస్తోంది. అదే సమయంలో ఆలయంలోకి వచ్చిన ఓ వ్యక్తి బాలికను గమనించాడు.
అనంతరం చిన్నారి దగ్గరకు వెళ్లి బలవంతంగా తాకేందుకు ప్రయత్నించాడు. బాలిక అడ్డుకున్నప్పటికీ పట్టించుకోకుండా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయాందోళనకు గురైన చిన్నారి గట్టిగా కేకలు వేసింది. బాలిక కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ మొత్తం ఘటన ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
కుటుంబ సభ్యులకు విషయం చెప్పిన బాలిక
నిందితుడు వెళ్లిపోయిన తర్వాత బాలిక మరోసారి శివలింగానికి నమస్కరించి ఆలయం నుంచి బయటకు వెళ్లింది. అనంతరం తనకు ఎదురైన చేదు అనుభవాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు నిగ్డీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో బాలిక పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించినట్లు గుర్తించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించారు.
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల విచారణలో నిందితుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన విశాల్ సింగ్‌గా గుర్తించారు. అతడు ఓ మెట్రో కాంట్రాక్టర్ వద్ద కార్మికుడిగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. ఘటనకు సంబంధించి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయం వంటి పవిత్రమైన ప్రదేశంలోనూ చిన్నారులకు రక్షణ లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమాయక బాలికలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నారుల భద్రత విషయంలో కుటుంబ సభ్యులతో పాటు సమాజం, సంబంధిత అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
