
D Spiritual: Dec 15: హిందూ సంప్రదాయంలో దీపారాధనకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా గుమ్మడికాయతో చేసే కూష్మాండ దీపాన్ని అత్యంత శక్తివంతమైన దీపారాధనగా పరిగణిస్తారు. ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
కూష్మాండ దీపాన్ని వెలిగించడం ద్వారా దృష్టిదోషం, నరపీడ, శని ప్రభావం వంటి గ్రహదోషాలు దూరమవుతాయని విశ్వాసం. దీని వల్ల ఇంటి వాతావరణం సానుకూలంగా మారి, నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా నశిస్తుందని అంటారు.
ఈ దీపం ప్రత్యేకత ఏమిటంటే, ఇది కాలభైరవ స్వరూపానికి సమర్పించే దీపారాధనగా భావించబడుతుంది. గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, లోపలి గింజలను తీసి, పసుపు–కుంకుమ రాసి, నువ్వుల నూనె పోసి వత్తులు పెట్టి దీపాన్ని వెలిగిస్తారు. ఈ విధానాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే కాలభైరవుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
సాధారణ దీపారాధనతో పోలిస్తే కూష్మాండ దీపం ఎక్కువ శక్తిని ఇస్తుందని శాస్త్రాలు పేర్కొంటాయి. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల చండీ హోమం చేసినంత ఫలితం దక్కుతుందని నమ్మకం ఉంది. దుష్ట శక్తులు తొలగిపోయి ఇంట్లో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి.
ముఖ్యంగా పిల్లలు మాట వినకపోవడం, సంతాన సమస్యలు వంటి ఇబ్బందులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అలాగే రోజువారీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు కూడా సులభంగా తొలగిపోతాయని చెబుతారు.
ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలతో బాధపడేవారు ఈ కూష్మాండ దీప పరిహారాన్ని అనుసరిస్తే మంచి మార్పులు కలుగుతాయని విశ్వాసం. ప్రత్యేకంగా కాలాష్టమి లేదా అష్టమి తిథుల్లో ఈ దీపాన్ని వెలిగిస్తే అఖండ ఫలితాలు లభిస్తాయని అంటారు.
ఎవరైనా సరే ఇంట్లోనే సులభంగా ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించి, కాలభైరవ అష్టకం పఠించడం ద్వారా దివ్య అనుగ్రహాన్ని పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు.
