
D News : నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’పై కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35MM థియేటర్లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో కలిసి ఆయన సినిమాను వీక్షించారు. సినిమా చూసిన అనంతరం తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అణచివేతకు ఎదురొడ్డి ఒక సమాజం తన ఉనికి, గుర్తింపు కోసం చేసే పోరాటాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బలంగా చూపించారని కేటీఆర్ ప్రశంసించారు. ఈ కథను తెరపైకి తీసుకొచ్చిన ఓదెలకు అభినందనలు తెలిపారు. జడల్ పాత్రలో నాని నటనకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.
ప్రియదర్శికి ప్రత్యేక అభినందనలు
సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్ర పోషించిన ప్రియదర్శిని కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు థియేటర్లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్నాయి. కేటీఆర్ కూడా ఆ సన్నివేశం సమయంలో చిరునవ్వుతో స్పందించినట్లు తెలుస్తోంది.
సినిమా అనంతరం థియేటర్ బయట మాట్లాడిన కేటీఆర్.. అణచివేతకు గురైన ప్రజల తరఫున ఒక నాయకుడు నిలబడి వారి గుర్తింపు కోసం పోరాడే అంశాన్ని సినిమా ద్వారా చూపించారని పేర్కొన్నారు. తెలంగాణ నేపథ్యం, స్థానిక యాస, భాషను కథలో భాగం చేసిన విధానం తనను ఆకట్టుకుందని తెలిపారు.
కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమాలోని శంకరన్న పాత్రపై ఆయన స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
