Fahadh Faasil’s Movie Gets Jr NTR’s Support.. NTR to Attend the Pre-Release Event as Chief Guest!

D News : మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. దర్శకుడిగా శశాంక్ యేలేటి పరిచయం అవుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో మేకర్స్ వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. తాజాగా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన కీలక విషయాన్ని ప్రకటించారు. సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

గెస్ట్‌గా తారక్

ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చాలా కాలం తర్వాత తారక్ అభిమానులను, ప్రేక్షకులను కలవనున్నారంటూ ఆసక్తికరంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.

ఎన్టీఆర్ రాకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ ‘అన్నా.. వెయిటింగ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫహాద్ ఫాజిల్ సినిమా వేడుకకు ఎన్టీఆర్ హాజరు కానుండటంతో ఈ ఈవెంట్‌పై టాలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రంలో సారా పాలేకర్, సౌరభ్ సచ్‌దేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

By Avinash