Mohan Babu’s Sensational Comments: ‘Industry Belongs to Nobody’.. Praises Nani and Srikanth Odela

D News : ‘ది ప్యారడైజ్’ విజయంతో చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న మోహన్ బాబు.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఎదగాలంటే ప్రతిభ, కష్టం, అంకితభావమే కీలకమంటూ చేసిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

శ్రీకాంత్ ఓదెల ప్రతిభను మోహన్ బాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎంతోమంది దర్శకులతో పనిచేశానని చెప్పిన ఆయన.. ఓదెలలో ప్రత్యేకమైన టాలెంట్ కనిపించిందన్నారు. భవిష్యత్తులో అతను మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాడని అభినందించారు.

‘ఇండస్ట్రీ ఎవరి సొత్తు కాదు’

సినిమా రంగంలో ఎవరి అండదండలు ఉన్నా.. చివరకు ప్రతిభే నిలబెడుతుందని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీ ఎవరి సొంతం కాదని, కష్టపడే వారికి అవకాశాలు, గుర్తింపు తప్పకుండా వస్తాయని అన్నారు. సొంతంగా ఎదిగిన ఎంతోమంది కళాకారులు తమ ప్రతిభతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తుచేశారు.

ఇదే సందర్భంలో నటనకు సంబంధించిన ఆయన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. కొంతమంది డ్యాన్స్ చేయడంలో ముందున్నప్పటికీ.. నటనలోని నవరసాలను పలికించడం, కళ్లతో భావాలను వ్యక్తం చేయడం వంటి విషయాల్లో తేడా ఉంటుందని అన్నారు.

నాని నటనపై ప్రశంసలు

నానిలో మాత్రం అన్ని రకాల భావాలను పండించగలిగే నటుడు ఉన్నాడని మోహన్ బాబు ప్రశంసించారు. ‘ది ప్యారడైజ్’లో తన పాత్రకు నాని పూర్తి న్యాయం చేశాడని, నటుడిగా అతడిలో ఉన్న విభిన్న కోణాలను ఈ సినిమా మరోసారి చూపించిందని పేర్కొన్నారు.

అయితే తన వ్యాఖ్యల్లో మోహన్ బాబు ఎవరినీ నేరుగా ప్రస్తావించలేదు. దీంతో ‘కొంతమందికి డ్యాన్స్ తప్ప నటన రాదు’ అనే వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. నెటిజన్లు తమకు నచ్చిన విధంగా ఆ వ్యాఖ్యలకు అర్థాలు వెతుకుతున్నారు.

By Avinash